పరిటాల ఫ్యామిలీకి ఇంత కష్టం వచ్చిందేమిటి?
ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబ హవా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
By: Tupaki Desk | 15 Feb 2024 7:30 AM GMTఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబ హవా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పరిటాల రవి మరణానంతరం కూడా 2009, 2014 వరకూ ఆయన భార్య పరిటాల సునీత వరుసగా గెలిచారు.. రాజకీయంగా హవా కంటిన్యూ చేశారు. అయితే 2019కి వచ్చేసరికి సీన్ మొత్తం పారిపోయిందనే కామెంట్లు వినిపిస్తుండగా.. 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ పరిస్థితి మరింత దారుణంగా మారిందనే చర్చ నడుస్తుంది.
అవును... ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుక్రొంటుందని అంటున్నారు. ప్రధానంగా సొంత పార్టీలోని గ్రూపు రాజకీయాలకు తోడు.. అధిష్టానం చేస్తున్న కొన్ని పనులు, తీసుకుంటున్న నిర్ణయాలు వెరసి పరిటాల సునీత, పరిటాల శ్రీరాం ల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందనే చర్చ తెరపైకి వచ్చింది. పైగా ఈ దఫా ఇద్దరిలో ఒక్కరికే టిక్కెట్ అని అంటున్నారని తెలుస్తున్న నేపథ్యంలో ఇది మరింత క్లిష్టతరంగా మారిందని చెబుతున్నారు.
వాస్తవానికి పరిటాల రవి మరణానంతరం పరిటాల సునీత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాగా... ఆమెకు ఘనస్వాగతం లభించిందనే చెప్పాలి. ఈ క్రమంలో 2009లో 1,707 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచిన ఆమె... 2014 ఎన్నికలకు వచ్చేసరికి 7,774 ఓట్ల మెజారిటీ సాధించారు.. ఇదే సమయంలో మంత్రి కూడా అయ్యారు. అయితే.. మంత్రిగా ఆమె సొంత జిల్లాలో చేసిన అభివృద్ధిపై ప్రజలు పెదవి విరుస్తున్నారనే చర్చ మొదలైంది.
ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల సునీత స్థానంలో ఆమె కుమారుడు పరిటాల శ్రీరాం బరిలోకి దిగారు. దీంతో ఈ ఎన్నికల్లో పరిటాల శ్రీరాం పై వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 25,575 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గం పూర్తిగా ఆయన ఆధీనంలోకి వెళ్లిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఈ ఎఫెక్ట్ జిల్లా మొత్తం వ్యాపించిందనీ అంటున్నారు.
దీంతో... ఈసారి ఎన్నికల్లో రాప్తాడుతో పాటూ ధర్మవరం నుంచి తల్లి, కొడుకు ఇద్దరూ పోటీచేయాలని భావించినట్లు చెబుతున్నారు. అయితే పరిటాల కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇవ్వడానికి చంద్రబాబు ఏమాత్రం అంగీకరించడం లేదని అంటున్నారు. పైగా... ఆ కుటుంబానికి ఒక్కసీటే చాలన్నట్లుగా తన అనుకూల మీడియాలో చంద్రబాబు తనమార్కు కథనాలు అచ్చెయిస్తున్నారని అంటున్నారు. దీంతో... పరిటాల ఫ్యామిలీకి వచ్చే ఎన్నికల్లో రాప్తాడు టిక్కెట్ మాత్రమే దక్కే అవకాశాలున్నాయని తెలుస్తుంది.
దీంతో... మరి ఈసారి రాప్తాడులో ఎవరు పోటీచేయాలి? రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఒకసారి మంత్రిగా పనిచేసిన సునీత పోటీ చేస్తారా.. లేక, గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన శ్రీరాం పోటీ చేస్తారా అనేది ఇప్పుడు అక్కడున్న తమ్ముళ్ల మధ్య డిబేటబుల్ పాయింట్ గా మారిందని అంటున్నారు. అయితే... ఈసారి కూడా రాప్తాడు టిక్కెట్ తనకే ఇవ్వాలని శ్రీరాం... తన తల్లిమీద ఒత్తిడి చేస్తున్నట్టు చెబుతున్నారు.
అదే జరిగితే 2019 ఫలితం రిపీట్ అవుతుందేమో అనే ఆందోళనలో సునీత ఉన్నారని అంటున్నారు. కేడర్ కూడా సునీత వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో శ్రీరాం కూడా పట్టు విడవటం లేదని సమాచారం. ఆ సంగతి అలా ఉంటే... పార్టీలోనే పరిటాల ఫ్యామిలీకి ప్రత్యర్థులు ఎక్కువైపోయారనే చర్చ కూడా జిల్లా వ్యాప్తంగా నడుస్తుంది. ఇందులో భాగంగా... ధర్మవరంలో వరదాపురం సూరికి, పరిటాల ఫ్యామిలీకీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని అంటున్నారు.
ఇదే సమయంలో టీడీపీలోని కీలక నేత పయ్యావుల కేశవ్ కు పరిటాల కుటుంబంతో పొసగడం లేదు! ఇదే సమయంలో ప్రభాకర్ చౌదరికి పరిటాల ఫ్యామిలీకీ ఏమత్రం పడటం లేదు! ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని టీడీపీ కీలక నేతలతో పరిటాల ఫ్యామిలీకి పొసగకపోవడంతో రాప్తాడులో ఈసారి పరిటాల ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో అసలు అక్కడ నుంచి కేడర్ కోరిక మేరకు సునీత పోటీ చేస్తారా.. లేక, శ్రీరాం బరిలోకి దిగుతారా అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉందని చెబుతున్నారు.