Begin typing your search above and press return to search.

పరిటాల శ్రీరామ్‌.. వృతం చేసినా ఫలితం దక్కడం లేదా?

దివంగత మంత్రి పరిటాల రవి ప్రధాన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   11 March 2024 5:42 AM GMT
పరిటాల శ్రీరామ్‌.. వృతం చేసినా ఫలితం దక్కడం లేదా?
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు హీట్‌ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో కీలకమైన అనంతపురం జిల్లా రాజకీయాలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. అందులోనూ విలక్షణతకు మారుపేరైన ధర్మవరం నియోజకవర్గంలో టికెట్‌ కోసం బీజేపీ, టీడీపీ పోటీ పడుతున్నాయి.

టీడీపీ తరఫున దివంగత మంత్రి పరిటాల రవి కుమారుడు శ్రీరామ్, బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) టికెట్‌ ఆశిస్తున్నారు. దీంతో అక్కడి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది.

దివంగత మంత్రి పరిటాల రవి ప్రధాన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. 2009లో టీడీపీ తరఫున ధర్మవరం నుంచి పోటీ చేసిన వరదాపురం సూరి ఓటమి పాలయ్యారు. 2014లో మళ్లీ టీడీపీ తరఫునే పోటీ చేసిన ఆయన విజయం అందుకున్నారు. 2019లో మళ్లీ బరిలోకి దిగిన వరదాపురం సూరి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

2019 ఎన్నికల్లో ఓడిన వెంటనే వరదాపురం సూరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికీ ఆయన బీజేపీలోనే ఉన్నారు. టీడీపీ, బీజేపీ పొత్తు కుదరకముందు టీడీపీలోకి రావాలని ఆశించారు. టీడీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు.

అయితే ఎట్టకేలకు బీజేపీ, టీడీపీ పొత్తు కుదరడంతో వరదాపురం సూరికి ఇబ్బందులు తొలగిపోయాయి. బీజేపీ ఈ సీటును ఆశిస్తోంది. బీజేపీకి ఈ సీటును కేటాయించడం దాదాపు ఖాయమేనంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరఫున వరదాపురం సూరి పోటీ చేస్తారని చెబుతున్నారు.

మరోవైపు పోయిన ఎన్నికల్లో వరదాపురం సూరి టీడీపీని వీడి బీజేపీలో చేరడంతో ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీకి ఇంచార్జి లేకుండా పోయారు. దీంతో పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్‌ టీడీపీ కార్యకలాపాలను ముందుకు నడిపించారు. పార్టీ తరఫున కార్యకలాపాలు అన్నీ నిర్వహించారు. దీంతో సహజంగానే శ్రీరామ్‌ ధర్మవరం సీటును ఆశిస్తున్నారు.

గత ఎన్నికల్లో శ్రీరామ్‌ తన తల్లి, నాటి మంత్రి పరిటాల సునీతను పక్కనపెట్టి రాప్తాడు నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి చేతిలో శ్రీరామ్‌ ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గాన్ని మళ్లీ తన తల్లి సునీతకే వదిలేసి ధర్మవరం నియోజకవర్గంలో శ్రీరామ్‌ తన కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌ లను కలిసిన పరిటాల సునీత, శ్రీరామ్‌ ఈసారి తమ కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వాలని కోరారు. రాప్తాడు నుంచి తాను, ధర్మవరం నుంచి తన కుమారుడు శ్రీరామ్‌ పోటీ చేస్తారని సునీత.. చంద్రబాబుకు తెలిపారు.

ఇంకోవైపు గతంలో ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి ప్రస్తుతం బీజేపీలో ఉన్న వరదాపురం సూరి కూడా టికెట్‌ ను ఆశిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారని అంటున్నారు. ఈ సీటును బీజేపీకి విడిచిపెట్టాలా లేక పరిటాల శ్రీరామ్‌ కు ఇవ్వాలా మల్లగుల్లాలు పడుతున్నారు.

మరోవైపు వరదాపురం సూరిని పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోతే అనాథలా మారిన ధర్మవరం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను తాను నిర్వహించానని శ్రీరామ్‌ చెబుతున్నారు. తనకే సీటు ఇవ్వాలని కోరుతున్నారు. మరి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

ఇప్పటికే రాప్తాడు అభ్యర్థిగా పరిటాల సునీతను చంద్రబాబు ప్రకటించారు. ఒక కుటుంబంలో ఒకరికే టికెట్‌ ఇచ్చే యోచనలో ఆయన ఉన్నారని అంటున్నారు. ఇప్పటివరకు చంద్రబాబు కుటుంబం మినహాయించి మరే నేత కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పరిటాల శ్రీరామ్‌ కు నిరాశ తప్పేలా లేదని టాక్‌ నడుస్తోంది.