వీడియో వైరల్... కారు పార్కింగ్ కోసం ఇంత రచ్చా..?
సిటీల్లో అద్దెకు ఇళ్లు దొరకడం కంటే.. అక్కడ పార్కింగ్ స్థలం దొరకడం అనేది అతిపెద్ద విషయం అనేది చాలా మందికి స్వానుభవమే!
By: Tupaki Desk | 28 Aug 2024 9:05 AM GMTసిటీల్లో అద్దెకు ఇళ్లు దొరకడం కంటే.. అక్కడ పార్కింగ్ స్థలం దొరకడం అనేది అతిపెద్ద విషయం అనేది చాలా మందికి స్వానుభవమే! ఇంటి విషయాల్లోనే కాదు.. చాలా షాపుల ముందు కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంటుంది. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా కారు పార్కింగ్ దగ్గర మొదలైన చిన్న గొడవ చినికి చినికి గాలివానగా మారిన ఓ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
అవును.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ హల్ చల్ చేస్తుంది. కొంతమంది వ్యక్తులు చేతుల్లోకి స్టిక్ లు, బ్యాట్ లు పట్టుకుని కొట్టేసుకుంటున్నట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇక అక్కడే ఉన్న ఓ కారు అద్దాలను అయితే చాలా కసితో పగలగొట్టడం కనిపించింది. ఏమిటి మరీ ఈ కారుపై వాళ్ల ప్రతాపం.. ఈ రచ్చ అంతా దేనికి.. అని అంటే... ఇదంతా పార్కింగ్ కోసం!
వివరాళ్లోకి వెళ్తే... నొయిడాలోని సెక్టార్ 72లో సోమవారం సాయంత్రం సమయంలో కారు పార్కింగ్ విషయంలో రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి వాగ్వాదం మొదలైంది! అనంతరం అది చినికి చినికి గాలివానగా మారి ఆ రెండు కుటుంబాల మధ్య హింసాత్మక ఘటనగా మారినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.
ఇలా చిన్నగా మొదలైన గొడవ కాస్తా పెద్దదిగా మారి హింసాత్మకం అయినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అక్కడ పార్క్ చేసిన ఉన్న మరో కుటుంబానికి చెందిన కారును ధ్వంసం చేశారు. ఇదే సమయంలో ఆ కుటుంబంపై కూడా దాడి చేశారని పోలీసులు వెల్లడించారు!
దీంతో... ఈ గొడవకు సంబంధించి పోలీసులు ఆరుగురుని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్కింగ్ కోసం ఇంత రచ్చ అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.