Begin typing your search above and press return to search.

కార్లు అమ్మాలంటే పార్కింగ్ చూపించాలట.. ఆ రాష్ట్రంలో కొత్త రూల్?

కారు కొనే వారు ఎవరైనా సరే.. ఆ వాహనాన్ని పెట్టేందుకు అవసరమైన పార్కింగ్ ప్రదేశాన్ని చూపించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే కారు అమ్మేందుకు అనుమతిస్తారు. ఇప్పుడు ఇదే తరహా రూల్ ను మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   15 Jan 2025 5:30 PM GMT
కార్లు అమ్మాలంటే పార్కింగ్ చూపించాలట.. ఆ రాష్ట్రంలో కొత్త రూల్?
X

సంచలన రూల్ తెచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందన్న వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి మహారాష్ట్ర సర్కారు తెద్దామనుకున్న రూల్ మన దేశంలో లేదు కానీ.. చాలా ప్రాశ్చాత్య దేశాల్లో ఉన్నదే. కారు కొనే వారు ఎవరైనా సరే.. ఆ వాహనాన్ని పెట్టేందుకు అవసరమైన పార్కింగ్ ప్రదేశాన్ని చూపించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే కారు అమ్మేందుకు అనుమతిస్తారు. ఇప్పుడు ఇదే తరహా రూల్ ను మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

దీని అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కసరత్తు జరుగుతున్నట్లుగా మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రకటించారు. దీని ప్రకారం.. కారు కొనుగోలు చేసే వేళలో.. పార్కింగ్ స్థలానికి సంబంధించిన పత్రాల్ని సమర్పించాల్సి ఉంటుందని.. త్వరలోనే ఈ నిబంధనను అమల్లోకి తేనున్నట్లుగా పేర్కొన్నారు. ఇటీవల కాలంలో వాహనాల పార్కింగ్ పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో.. ఈ తీరుకు చెక్ చెప్పేందుకు వీలుగా కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న ఆలోచన మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పార్కింగ్ లేనప్పటికి పెద్ద ఎత్తున కార్లు కొనుగోలు చేయటం.. రోడ్ల మీద అడ్డదిడ్డంగా ఆపేస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు అత్యవసర వేళలో అంబులెన్సులు.. ఫైరింజన్లు వేగంగా గమ్యస్థానానికి చేరుకోలేని పరిస్థితి. అపార్టుమెంట్లలో నివిసించే వారు సైతం తమకు కారు పార్కింగ్ స్థలం లేకున్నా.. వాహనాల్ని కొనుగోలు చేయటం ద్వారా ముంబయి మహానగరంలో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వీలుగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ముందడుగు వేస్తున్నట్లుగా చెప్పక తప్పదు. మిగిలిన రాష్ట్రాలు సైతం ఇదే తరహాలో ముందుకు వెళ్లటం చాలా అవసరం.

అయితే.. తాము తీసుకురావాలనుకున్న నిబంధనపై విమర్శలు వచ్చే అవకాశం ఉందన్న మంత్రి.. ‘మధ్యతరగతి ప్రజలు కార్లు కొనుగోలు చేయొద్దని మేం చెప్పట్లేదు. దానికి అనుగుణంగా పార్కింగ్ స్థలాల్ని ఏర్పాటు చేసుకోవాలి. ట్రాఫిక్ రద్దీని కంట్రోల్ చేయటానికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాం. ఈ నిబంధనను త్వరలో అమలు చేసేందుకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ శిందేతో కలిసి చర్చించనున్నామన్నారు.