Begin typing your search above and press return to search.

కేంద్రం గొంతులో మణిపుర్ వెలక్కాయ.. పార్లమెంటులో కక్కలేదు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

By:  Tupaki Desk   |   20 July 2023 11:23 AM GMT
కేంద్రం గొంతులో మణిపుర్ వెలక్కాయ.. పార్లమెంటులో కక్కలేదు
X

సరిగ్గా నాలుగు నెలలవుతోంది మణిపుర్ లో ఘర్షణలు మొదలై. ఇప్పటికి వందమందిపైనే చనిపోయారు. ఇంటర్నెట్ బంద్ అయింది. కుకీలు-మీటీల మధ్య శత్రుత్వం పెరిగిపోయింది. మధ్యలో జరిగిన ఘర్షణల్లో ఒక్కరోజులోనే 40 మందిపైగా మిలిటెంట్లు హతమయ్యారు. ఇన్ని రోజుల నుంచి ప్రధాని మోదీ మణిపుర్ పై నోరు విప్పలేదు. తాజాగా అక్కడ ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఉదంతంపై మాత్రం స్పందించారు. అసలు సమస్య (మీటీలకు రిజర్వేషన్ పై తలెత్తిన ఘర్షణ) గురించి మాత్రం ఇప్పటికీ ఆయన నుంచి సమాధానం లేదు.

కొత్త పార్లమెంటులో కష్టాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి మొదలయ్యాయి. కొత్త భవనంలో ఇవే మొదటి సమావేశాలు కావడం ఈసారి ప్రత్యేకత. అయితే, తొలి రోజే మణిపుర్‌ అంశం ఉభయ సభలను కుదిపేసింది. అక్కడ జరుగుతున్న అల్లర్లు, తాజా ఘటనలపై చర్చించాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. రెండు సార్లు స్వల్ప వ్యవధి పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనప్పటికీ సభ్యులు ఆందోళన వీడలేదు. దీంతో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.

వాస్తవానికి ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. మణిపుర్ పై గొడవతో మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి మొదలైనా మణిపుర్‌ పై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో మళ్లీ రెండు గంటలకు వాయిదా పడ్డాయి. తిరిగి ప్రారంభమైనప్పటికీ.. మణిపుర్‌ అంశంపై ప్రతిపక్షాలు తగ్గలేదు.

లోక్‌ సభలో అయితే, 'మణిపుర్‌ - మణిపుర్‌, మణిపుర్‌- కాలిపోతోంది' అంటూ ప్రతిపక్షాలు నినాదాలు చేశాయి. స్పీకర్‌ ఎంత చెప్పినా సభ్యులు వినలేదు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఇండియా కూటమి వదులుతుందా?

పార్లమెంటు పాత భవనంలో చివరిసారిగా జరిగిన సమావేశాల్లో అదానీ అంశంపై విపక్షాలు గట్టిగా ప్రశ్నించాయి. మోదీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈసారి 26 విపక్షాలు ఇండియా పేరిట కూటమి కట్టాయి. ఇదే సమయంలో మణిపుర్ లో మహిళలపై జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి మణిపుర్ పై గట్టిగా పట్టుపట్టే అవకాశం కనిపిస్తున్నది.

కేంద్ర చర్చకు పెడుతుందా..?

మణిపుర్‌ సంఘటనలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజ్యసభాపక్ష నేత, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ద్ జోషీ సైతం రెండు సభల్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీంతో కేంద్రం మణిపుర్ పై పార్లమెంటులో చర్చించే వీలున్నట్లు తెలుస్తోంది. చర్చ ప్రారంభమైన తర్వాత మణిపుర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పూర్తి వివరణ ఇస్తారని జోషీ చెప్పారు. చర్చ సమయాన్ని స్పీకర్‌ నిర్ణయిస్తారని పేర్కొన్నారు.