కేసీఆర్, విజయశాంతి, ఈటల రాజేందర్ ముగ్గురూ మెదక్ నుంచేనా?
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరెవరు పోటీలో ఉంటారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది
By: Tupaki Desk | 21 Dec 2023 2:45 AM GMTరాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరెవరు పోటీలో ఉంటారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారనే ఆసక్తికర వాదనలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో పార్లమెంట్ బరిలో నిలిచేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో ఎవరు పోటీలో నిలుస్తారనే దాని మీద తర్జనభర్జనలు సాగుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ అసెంబ్లీ స్థానమైన కరీంనగర్ నుంచి పోటీలో నిలిచినా ఓటమి పాలయ్యారు. బీజేపీలో మహామహులే పరాజయం పాలు కావడంతో ఇక పార్లమెంట్ స్థానాల్లో వారికి టికెట్లు ఇస్తారా? లేక కొత్తవారిని పోటికి దించుతారా అనే దాని మీద ప్రస్తుతం హాట్ చర్చలు కొనసాగుతున్నాయి.
మెదక్ ఉమ్మడి జిల్లాలో ముదిరాజ్ ఓట్లు అధికంగా ఉండటంతో ఇక్కడి పార్లమెంట్ స్థానం నుంచే ఈటల రాజేందర్ పోటీ చేయాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈటల గజ్వేల్ నుంచి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈటల రాజేందర్ మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈటల పోటీ చేస్తే విజయం సాధిస్తారా? లేదా అనేది తెలియడం లేదు.
దుబ్బాక మాజీ ఎమ్మెల్యే విజయరఘునందన్ రావు కూడా మెదక్ పార్లమెంట్ స్థానంపై కన్నేసినట్లు సమాచారం. 2014లో ఇక్కడ నుంచి పోటీ చేసిన ఆయన మూడో స్థానంలో నిలిచారు. మెదక్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ ఎవరికి కేటాయిస్తుందో తెలియడం లేదు. ఈ క్రమంలో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్, కాంగ్రెస్ నుంచి విజయశాంతి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఆశిస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోరు కొనసాగనుందని తెలుస్తోంది.
మెదక్ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు బీఆర్ఎస్ గెలుచుకోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీనే ఆధిపత్యం చెలాయిస్తుందని అంచనా వేస్తున్నారు. కేసీఆర్, విజయశాంతి, ఈటల రాజేందర్ మధ్య పోరు జరుగుతుందని ఆశిస్తుండటంతో ఓటర్లు ఎవరిని విశ్వసిస్తారో అంతుచిక్కడం లేదు. ముగ్గురు నేతల మధ్య రసవత్తర పోరు కొనసాగనుందని చెబుతున్నారు.
మెదక్ పార్లమెంట్ స్థానంపై అందరికి ఆసక్తి పెరుగుతోంది. మహామహులే రంగంలో ఉండనుండటంతో పోటీ కూడా రసవత్తరంగా మారనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి ఎదుటి పార్టీలకు తమ సత్తా చూపించాలని మూడు పార్టీలు రెడీ అవుతున్నాయి. ఏ పార్టీ విజయం సాధిస్తుందో? ఓటరు ఎటు వైపు మొగ్గు చూపుతాడో అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి.