మీరు సరే.. జనాన్ని తయారు చేశారా?!
'హమ్ తయార్ హై'- నినాదంతో కాంగ్రెస్ పార్టీ 139వ పుట్టిన రోజు(ఆవిర్భావ) సంబరాన్ని అంగరంగ వైభవంగా చేసుకుంటోంది
By: Tupaki Desk | 28 Dec 2023 9:52 AM GMT'హమ్ తయార్ హై'- నినాదంతో కాంగ్రెస్ పార్టీ 139వ పుట్టిన రోజు(ఆవిర్భావ) సంబరాన్ని అంగరంగ వైభవంగా చేసుకుంటోంది. వచ్చే 2024 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ రెడీగా ఉందని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అయితే.. ఇక్కడ అసలు క్వశ్చన్.. మీరు సరే.. జనాన్ని ఆ దిశగా తయారు చేశారా? అనేది. ఎందుకంటే.. గతానికి భిన్నంగా ఇప్పుడు ప్రదాని మోడీ కేవలం నాయకుడు మాత్రమే కాదు.. అంతకుమించిన వ్యూహకర్తగా మారారు.
ఈ విషయాన్ని కాంగ్రెస్ గుర్తించే లోగానే.. మూడు కీలక రాష్ట్రాల్లో ఇటీవల చేతులు కాల్చేసుకుంది. పోనీ.. ఇప్పుడైనా గుర్తించిందా? అంటే.. అది కూడా కనిపించడం లేదు. ఒకవైపు కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంకు.. ఎస్సీ,ఎస్టీ, బీసీలు. వీటిని కూడా కదల బార్చి.. తనకు అనుకూలంగా మోడీ తిప్పుకొంటున్నారు. ఈ క్రమంలో పుట్టిందే.. కీలకమైన.. వికసిత భారత్ సంకల్ప యాత్ర. దాదాపు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి 1000 కోట్ల రూపాయలను కేటాయించారు.
అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికీ చేరవేస్తున్నారు. ఎక్కడా ఒక్కరు కూడా మిస్ కాకుండా.. లబ్ధిదారులను పిలిచి మరీ పథకాల్లో చేరుస్తున్నారు. ఇది పైకి కనిపిస్తున్నట్టు ప్రభుత్వ కార్యక్రమమే అయినా.. దీనివెనుక ఫక్తు మోడీ ఎన్నికల వ్యూహం ఉంది. దీనిని కాంగ్రెస్ ఇంకా గుర్తించలేదు. ఇక, అయోధ్య రామమందిరం.. ప్రారంభం. ఇది కూడా పూర్తిగా ఎన్నికల స్టంటే. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఒడుపుగా తనకు అనుకూలంగా మలుచుకోవాల్సి ఉంది.
కానీ, దీనిని కూడా.. పార్టీ కేవలం ప్రతిపక్ష కళ్లతోనే చూసింది. ఈ క్రమంలో మేం వచ్చేది లేదని.., రాముడిని రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తోంది. ఈ పసలేని విమర్శలే మోడీకి వరంగా మారుతున్నాయి. అంతకుమించి.. ప్రజలను కార్యోన్ముఖులను చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ.. అడుగులు ముందుకు వేయడం లేదు. ఈ నేపథ్యంలో మేం తయారుగానే ఉన్నామని అంటున్న కాంగ్రెస్‌కు .. ప్రజలను తయారు చేశారా? అనే ఎదురు ప్రశ్న ఎదురవుతుండడం గమనార్హం.
ఇదిలావుంటే.. గురువారం కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం. ‘హమ్ తయార్ హై’ నినాదంతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో భారీ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి నేతలు హాజరుకానున్నారు. అసలు నాగపూర్‌లోనే కాంగ్రెస్ సభ నిర్వహించడానికి కారణాలు చాలా ఉన్నాయి. బీజేపీ సైద్ధాంతిక మాతృసంస్థ ఆరెస్సెస్ కి ప్రధాన కేంద్రంగా నాగ్‌పూర్ ఉన్న విషయం తెలిసిందే.
స్వాతంత్య్రానికి పూర్వం 1920లో సహాయ నిరాకరణ ఉద్యమానికి నాగ్‌పూర్ నుంచే పిలుపునివ్వడం జరిగింది. 1959లో నాగ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఏఐసీసీ చీఫ్‌గా ఇందిరా గాంధీ ఎన్నికయ్యారు. చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతంలో ఈసారి ఎన్నికల సంసిద్ధత సభను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. కానీ, ప్రజలను కార్యోన్ముఖులను చేయడం తోనే పార్టీ సక్సెస్ అవుతుందని అంటున్నారు పరిశీలకులు.