Begin typing your search above and press return to search.

కేంద్రంలో ఎవరికీ మెజారిటీ రావద్దు...జగన్ కోరిక వెనక...!

కేంద్రంలో మళ్లీ ఏర్పడే కొత్త ప్రభుత్వంలో ఏ పార్టీకి కానీ కూటమికి కానీ పూర్తి మెజారిటీ రాకూడదు అని కోరుకుంటున్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు

By:  Tupaki Desk   |   6 Feb 2024 7:43 PM GMT
కేంద్రంలో ఎవరికీ మెజారిటీ రావద్దు...జగన్ కోరిక వెనక...!
X

కేంద్రంలో మళ్లీ ఏర్పడే కొత్త ప్రభుత్వంలో ఏ పార్టీకి కానీ కూటమికి కానీ పూర్తి మెజారిటీ రాకూడదు అని కోరుకుంటున్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. నిజానికి ఇది జగన్ ఆసక్తికరమైన కోరికనే వెలుబుచ్చారు అని అనుకోవాలి. ఎందుకంటే దేశంలో ఏ పౌరుడైనా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం రావాలని కోరుకుంటారు. కానీ అస్థిర ప్రభుత్వం కోరుకోరు.

అలాంటిది అయిదేళ్ల పాటు పవర్ ఫుల్ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిన జగన్ కి అస్థిర ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందో తెలియదు అని ఎవరూ అనుకోరు. కానీ ఆయన కోరిక వెనక అయిదు కోట్ల ప్రజల బలమైన ఆకాంక్ష ఉంది అంటున్నారు. అదే ప్రత్యేక హోదా. నిజానికి ప్రత్యేక హోదా ఏపీకి ఇమ్మని అడిగితే పూర్తి మెజారిటీతో వచ్చే ప్రభుత్వాలు నో చెబుతాయి. అదే ఏపీలో వచ్చే ఎంపీ సీట్ల మీద ఆధారపడే ప్రభుత్వం వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది అన్నది జగన్ మార్క్ పొలిటికల్ లాజిక్.

అందుకే ఆయన నిండు సభ అసెంబ్లీ నుంచే ఈ కోరిక కోరుకున్నారు. దీనికి సరిగ్గా ఒక రోజు ముందే నరేంద్ర మోడీ కూడా నిండు పార్లమెంట్ లో తమ పార్టీకి ఒక్కదానికే 375 సీట్లు సొంతంగా వస్తాయని, ఎన్డీయే కూటమికి ఏకంగా 400 ఎంపీలు పైన వస్తాయని గట్టిగా చెప్పారు.

మోడీ ధీమా అలా ఉంటే జగన్ ఆలోచనలు ఇలా ఉన్నాయని అనుకోవాలి. అయినా దాదాపుగా పదిహేనేళ్ళుగా రాజకీయాల్లో ఉంటున్న జగన్ కి తెలియదా దేశంలో గాలి ఏ వైపు వీస్తోందో అన్నది విశ్లేషకుల మాట. సరే అలా కాకుండా జగన్ కోరుకున్నట్లుగానే బీజేపీకి కానీ ఎన్డీయే కూటమికి కానీ మెజారిటీ రాకపోతే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా అంటే అది కూడా కచ్చితంగా చెప్పడానికి లేదు అనే అంటున్నారు.

ఎందుకంటే బీజేపీ అన్ కండిషనల్ సపోర్ట్ నే తీసుకోవచ్చు. అలా ఇచ్చే పార్టీలు వేరే ఉంటాయి. లేకపోతే మంత్రి పదవులు ఇచ్చి అయినా వేరే పార్టీల నుంచి మద్దతుగా తమ వైపు తిప్పుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఇక గెలిచిన ఎంపీలను కూడా లాగేసుకునే క్రీడ కూడా ఉండనే ఉంది. ఇలా ఎన్నో ఇతర మార్గాలు దగ్గర దారులూ ఉండగా ప్రత్యేక హోదాకి కేంద్రానికి మెజారిటీ రాకపోవడానికి సంబంధం ఉందా అంటే అది జగన్ మార్క్ వ్యూహం.

అయితే ప్రాక్టికల్ గా చూస్తే మెజారిటీ ఒక పార్టీకి ఉన్నపుడే ప్రత్యేక హోదా అయినా మరో వరం అయినా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా అనేక పార్టీల మద్దతు తీసుకుని గద్దె నెక్కే పార్టీలు ఏపీ విషయంలో ఇంత శ్రధ ప్రేమ చూపిస్తాయా అంటే అది కూడా జరిగే అవకాశం అయితే ఎంత వరకూ అన్న ప్రశ్న వస్తోంది. అలా చూపిస్తే ఇతర పార్టీలు ఒప్పుకుంటాయా అన్నది మరో కీలక ప్రశ్న.

ఏది ఏమైనా కేంద్రంలోని పార్టీకి మెజారిటీ రావద్దు అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని జగన్ రాజకీయ ఎత్తుగడతోనే చెప్పారు. మరి ఇదే రేపటి రోజున జగన్ ఎన్నికల నినాదంగా కూడా అయ్యే చాన్స్ ఉంది అంటున్నారు.