పార్లమెంటు ప్రతిష్ఠంభనకు తెర.. విపక్షవ్యూహాత్మక అడుగు
మణిపూర్ పై పార్లమెంటులో చర్చించాలని ప్రధాని మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేయసాగాయి
By: Tupaki Desk | 3 Aug 2023 2:07 PM GMTకొత్త భవనంలో ఏ ముహూర్తాన ప్రారంభమైందో కాని.. పార్లమెంటు వర్షా కాల సమావేశాలు తొలి రోజు నుంచి ప్రతిష్ఠంభనే. దీనికి కారణం.. గత నెల 19న వెలుగులోకి వచ్చిన మణిపూర్ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన. సరిగ్గా పార్లమెంటు సమావేశాలకు ముందు రోజు బయటకు వచ్చిన ఈ వీడియో ప్రతిపక్షాలకు సరైన ఆయుధంగా మారింది. అసలే మణిపూర్ మే నెల ప్రారంభం నుంచి రగులుతోంది. అక్కడ ఏదో జరుగుతోందని ప్రచారం నెలకొంది.
ఈ నేపథ్యంలోనే మహిళలను ఘోరంగా అవమానించిన ఘటన బయటకు రావడంతో ప్రతిపక్షాలు గట్టిగా పట్టుకున్నాయి. మణిపూర్ పై పార్లమెంటులో చర్చించాలని ప్రధాని మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేయసాగాయి. జూలై 20 నుంచి పార్లమెంటు వాయిదాల పర్వమే కొనసాగింది. చివరకు బుధవారం స్పీకర్ ఓం బిర్లా సహనం నశించి సభ సజావుగా సాగేవరకు తాను హాజరుకాబోనని ప్రకటించారు. బుధవారం సభ 20 నిమిషాలు కూడా జరగలేదు. మరోవైపు రాజ్యసభలో విపక్షాలు వాకౌట్ చేశాయి. ప్రధాని మోదీ ప్రకటనకు పట్టుబడుతున్నందన ఆయనను సభకు రమ్మని తాను ఆహ్వానించలేనని రాజ్య సభ చైర్మన్ ధన్ ఖడ్ అన్నారు.
267 కాదు.. 176కు సై
మణిపూర్ పై రూల్ నం.267 కింద చర్చకు ఇండియా కూటమి విపక్షాలు పట్టుబుతున్నాయి. దీనికోసం పదుల సంఖ్యలో నోటీసులిచ్చాయి. కానీ, ప్రభుత్వం మాత్రం రూల్ నం.176 కింద చర్చకు అంగీకరించింది. అదే 267 కింద చర్చ అయితే సభ కార్యకలాపాలు అన్నిటిని పక్కనపెట్టి చర్చించాలి. 176 కింద అలా చేయాల్సిన అవసరం లేదు. తాజాగా తెలిసిందేమంటే.. ప్రతిపక్షాలు తమ బెట్టు వీడాయి. రూల్ నం176 కింద చర్చకు అంగీకరించినట్లు సమాచారం.
మోదీ ప్రకటనపైనా పట్టువీడారా?
రూల్ నం.267 కాకుండా 176 కింద చర్చకు అంగీకరించిన ప్రతిపక్షాలు మరో కీలక అంశం పైనా వెనక్కుతగ్గుతాయా? అన్నది తేలాల్సి ఉంది. ఆ రెండో అంశం ఏమంటే.. మణిపూర్ పై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాల్సిందే అన్న డిమాండ్. వాస్తవానికి మణిపూర్ లో అల్లర్లు బీజేపీ ప్రభుత్వ కుట్రగా విపక్షాలు అనుమానిస్తున్నాయి. చర్చ జరిగితే దానిపైనే గట్టిగా నిలదీసే అవకాశం ఉంది. కాగా.. ప్రతిపక్షాలు తమ పంతంపై వెనక్కు తగ్గడానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ ఖడ్ పలుసార్లు చేసిన ప్రయత్నాలే కారణమని తెలుస్తోంది. వీరిద్దరూ విపక్ష ఫ్లోర్ లీడర్లతో పలుసార్లు సమావేశమై ప్రతిష్ఠంభన తొలగేలా చూశారని సమాచారం.
కాగా, పార్లమెంటు సమావేశాలకు ఈ నెల 11 చివరి తేదీ. పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందులో ఒకటైన ఢిల్లీ ఆర్డినెన్సు స్థానంలో బిల్లు. దీనిని ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఇక మణిపూర్ పై రూల్ నం. 167 కింద స్వల్పకాలిక చర్చ జరిగితే దానికి సమాధానం ఇచ్చేది కూడా అమిత్ షానే. ఎందుకంటే మణిపూర్ లో తలెత్తినది శాంతిభద్రతల అంశం కాబట్టి.. అది హోం శాఖ పరిధిలోనిదే కాబట్టి ఆయనే జవాబిస్తారని కేంద్ర మంత్రులు ఇప్పటికే చెప్పారు. అమిత్ షా జూన్ నెలలో మణిపూర్ వెళ్లి వివిధ వర్గాలతోనూ శాంతి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.