రూల్ 267 వర్సెస్ రూల్ 176!
ఈ రెండింటిలో దేనికింద ఎలా చర్చిస్తారనే అంశాలపై ఆసక్తి నెలకొంది
By: Tupaki Desk | 22 July 2023 8:01 AM GMTమణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం, వారిలో ఒకరిపై అత్యాచారం చేసిన ఘటన, ఇందుకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా పార్టీలకతీతంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
మరోవైపు తాజాగా ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనూ మణిపూర్ ఘటనపై ఉభయ సభలు అట్టుడికాయి. ఈ దారుణంపై చర్చించాలని ఉభయ సభల్లో ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. చర్చకు నోటీసు కూడా ఇచ్చారు. రూల్ 267 కింద దీన్ని చర్చించాలని డిమాండ్ చేశారు. అయితే రూల్ 176 కింద మాత్రమే చర్చిస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే రూల్ 267 కింద మాత్రమే చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటు ఉభయ సభలను స్తంభింప చేశారు.
ఈ నేపథ్యంలో రూల్ 176, రూల్ 267లకు తేడాలు ఏంటి? ఈ రెండింటిలో దేనికింద ఎలా చర్చిస్తారనే అంశాలపై ఆసక్తి నెలకొంది.
రూల్ 267: రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (రాజ్యసభ) ప్రకారం రూల్ 267 కింద ఏదైనా అంశంపైన చర్చ సుదీర్ఘంగా ఉంటుంది. ఆ రోజు ఏదైనా అంశంపై చర్చకు సభ్యులు ముందుగానే నోటీసులు ఇచ్చి ఉంటే రాజ్యసభ చైర్మన్ వాటిని పూర్తిగా రద్దు చేస్తారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇలా చర్చ సుదీర్ఘంగా సాగడం వల్ల సంబంధిత అంశంపై సభ్యులు ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. చర్చ ఎన్ని గంటలు కొనసాగించాలన్న దానిపై ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనలు ఉండవు. ఎన్ని గంటలపాటైనా చర్చ జరపవచ్చు. అంతేకాకుండా చర్చ జరపడానికి తీర్మానం, దానిపై ఓటింగ్ వంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది.
రూల్ 176: ఇక రూల్ 176 కింద స్వల్పకాలిక వ్యవధిలో ముగిసే చర్చలు ఉంటాయి. ఈ నిబంధన కింద ఏ అంశంపైనా రెండున్నర గంటలకు మించి చర్చ ఉండదు. ఈ నిబంధన కింద ఏదైనా అంశంపై చర్చించాలంటే సభ్యులెవరైనా అప్పటికప్పుడు రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు నోటీసు ఇవ్వొచ్చు. ఆ నోటీసులో సంబంధిత అంశంపై ఎందుకు చర్చ కోరుతున్నారో వివరించాలి.అంతేకాకుండా ఆ నోటీసుకి మద్దతుగా మరో ఇద్దరు సభ్యులు కూడా సంతకాలు చేయాల్సి ఉంటుంది. రాజ్య సభ చైర్మన్ చర్చకు అంగీకరించిన తర్వాత ఆ రోజైనా, ఆ మరుసటి రోజైనా చర్చ ఉంటుంది. ఈ చర్చకు సంబంధిత అంశానికి చెందిన మంత్రి మాత్రమే సమాధానమిస్తారు. అయితే చర్చ మొత్తం రెండున్నర గంటల్లోనే ముగిసిపోతుంది. తీర్మానాలు, ఓటింగ్ జరపరు.
ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు రూల్ 267 కింద మణిపూర్ ఘటనను చర్చించాలని కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం రూల్ 176 కింద మాత్రమే చర్చిస్తామని చెబుతోంది. రూల్ 176 కింద అయితే చర్చ రెండున్నర గంటల్లోనే ముగుస్తుంది కాబట్టి ప్రతిపక్షాలు ఇందుకు ఒప్పుకోవడం లేదు.