13న అలజడి.. 17న మోడీ రియాక్షన్.. ఎంత వేగం 'విశ్వ గురూ'!
అయితే.. ఇన్ని రోజులైనా ఈ విషయంపై విశ్వగురువైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించలేదు
By: Tupaki Desk | 17 Dec 2023 8:38 AM GMTశతృదుర్భేధ్యంగా నిర్మించిన నూతన భారత పార్లమెంటు భవనంలోని ఆగంతకులు ప్రవేశించి.. గ్యాస్ క్యానెన్లు వెదజల్లి అలజడి సృష్టించిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇక,దేశంలోనూ ఈ పరిణామం ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు భద్రతపై అనేక అనుమానాలకు తావిచ్చింది. మరోవైపు గత రెండు రోజులుగా పార్లమెంటులో ప్రతిపక్షాలు ఈవిషయంపై అలజడి సృష్టిస్తున్నాయి.
అయితే.. ఇన్ని రోజులైనా ఈ విషయంపై విశ్వగురువైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించలేదు. తీరిగ్గా పార్లమెంటులో నెలకొన్న అలజడిపై ఇప్పుడు ముక్తసరిగా స్పందించారు. పార్లమెంటు భద్రత ఉల్లంఘన ఘటన తీవ్రమైన అంశమని ప్రధాని మోడీ ఖండించారు. ఈ ఘటనను అందరూ ఖండించాలని.. ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
అంతకుముందు, లోక్‌సభలో భద్రతా లోపంపై సీరియస్‌గా వ్యవహరించాలని సీనియర్ మంత్రులను మోడీ ఆదేశించారు.ఈ అంశంపై సమష్టిగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. పార్లమెంటులో అలజడికి సంబంధించి కీలక నిందితుడిగా భావిస్తున్న లలిత్ ఝాను పాటియాలా హౌస్ కోర్టు ఏడు రోజుల పోలీస్ కస్టడీకి పంపింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ సెల్ ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతోంది.
కోల్‌కతాకు చెందిన టీచర్ లలిత్ ఝా ఇప్పటికే పోలీసులకు లొంగిపోవడంతో వెంటనే అతన్ని అరెస్టు చేశారు. భద్రతా ఉల్లంఘనల ఘటనకు తెరవెనుక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝూ పోలీసు విచారణలో కీలక వివరాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు పట్టుబడగా, వారిలో నలుగురిని పోలీసు కస్టడీకి పంపారు.
అయితే.. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా క్షణాల వ్యవధిలో స్పందించే ప్రధాన మంత్రి మోడీ.. తనే నిర్మించిన పార్లమెంటు భవనంలో చోటు చేసుకున్న భద్రతా లోపాల ఘటనపై మాత్రం స్పందించేందుకు ఐదు రోజుల సమయం తీసుకోవడం.. అదికూడా ముక్తసరిగా స్పందించడం గమనార్హం.