ఇక దేశమంతా జీరో ఎఫ్.ఐ.ఆర్... నేర శిక్షాస్మృతి బిల్లులకు ఆమోదం!
భారతీయ న్యాయ సంహిత (బీ.ఎన్.ఎస్) లో... కొత్తగా 20 నేరాలను చేర్చడంతోపాటు ఐపీసీ సెక్షన్ 19 నిబంధనను తొలగించారు.
By: Tupaki Desk | 21 Dec 2023 4:53 AM GMTదాదాపు 200 ఏళ్లు పాలించిన బ్రిటిష్ హయాం నుంచి అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్ కోడ్ - ఐ.పీ.సీ), నేర శిక్షాస్మృతి (కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిజర్ - సీ.ఆర్.పీ.సీ), సాక్ష్యాధారాల చట్టం (ఎవిడెన్స్ యాక్ట్) స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన మూడు నేర శిక్షాస్మృతి బిల్లులకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఇక వాటిని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. అక్కడ కూడా ఆమోదం పొందితే.. ఆ తర్వాత రాష్ట్రపతి సంతకమే తరువాయి. ఆ సంతకం అవ్వగానే అవి చట్టాలుగా మారతాయి.
అవును... బ్రిటిష్ హయాం నుంచీ అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఐ.పీ.సీ), నేర శిక్షాస్మృతి (సీ.ఆర్.పీ.సీ), సాక్ష్యాధారాల చట్టం (ఎవిడెన్స్ యాక్ట్) స్థానంలో... భారతీయ న్యాయ సంహిత (బీ.ఎన్.ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీ.ఎన్.ఎస్.ఎస్.), భారతీయ సాక్ష్య అధినియం (బీ.ఎస్).. పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లులను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా భారతీయ చట్టాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ఇందులో భాగంగా పాత చట్టంలో అత్యాచారానికి సెక్షన్ 375, 376 ఉండగా... కొత్త బిల్లులో దానిని సెక్షన్ 63 గా పేర్కొన్నారు. ఇదే సమయంలో... పాత చట్టంలో హత్యకు సెక్షన్ 302 ఉండగా.. కొత్త బిల్లులో దానిని సెక్షన్ 101 గా మార్చారు. ఇదే క్రమంలో... కిడ్నాప్ కు పాత చట్టంలో సెక్షన్ 359 ఉండేది. అయితే... కొత్త బిల్లులో దానిని సెక్షన్ 136 కింద చేర్చచడం జరిగింది.
భారతీయ న్యాయ సంహిత (బీ.ఎన్.ఎస్) లో... కొత్తగా 20 నేరాలను చేర్చడంతోపాటు ఐపీసీ సెక్షన్ 19 నిబంధనను తొలగించారు. ఇదే సమయంలో 33 నేరాల్లో జైలు శిక్ష పెంచడంతోపాటు 83 నేరాల్లో జరిమానా పెంచారు. ఇక 23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్ష విధించేలా మార్పులుచేయడంతోపాటు కొత్తగా 6 నేరాల్లో సమాజ సేవా శిక్షను చేర్చారు. ఉదాహరణకు... రూ.5వేల లోపు దొంగతనాలకు చేసిన వారికి ఈ సమాజ సేవ శిక్ష విధిస్తారు.
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీ.ఎన్.ఎస్.ఎస్) విషయానికొస్తే... నేరాంగీకార పరిధిని విస్తరించారు. దీనిలో గతంలో 19 నేరాలుండగా ప్రస్తుతం 10ఏళ్లు అంతకంటే అధిక శిక్షల కేసులన్నింటికీ వర్తించేలా చర్యలు తీసుకున్నారు. ఇదే సమయంలో... మూడేళ్ల లోపు శిక్షలు పడే కేసుల్లో నిందితులను అరెస్టు చేయడానికి సీనియర్ పోలీసు అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు.
ఇదే సమయంలో ఒక దేశమంతా జీరో ఎఫ్.ఐ.ఆర్. విధానాన్ని తీసుకొచ్చారు. ఇకపై ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయబడుతుంది. ఇక ఇందులో 35 నేరాల్లో ఆడియో, వీడియో రికార్డింగ్ చేర్పుకు అవకాశం ఇవ్వడంతోపాటు 35 నేరాల్లో సత్వర న్యాయానికి సమయాన్ని నిర్ధేశించారు. అదేవిధంగా... క్షమాభిక్ష పిటిషన్ కు సరికొత్త విధివిధానాలు తెచ్చారు.
భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్) విషయానికొస్తే... ఈ కొత్త బిల్లులో రెండు కొత్త సెక్షన్లు, 6 సబ్ సెక్షన్ల జోడించడంతోపాటు మరో 6 సెక్షన్లను తొలగించారు. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో సాక్ష్యం సేకరణకు అనుమతి ఇచ్చారు. ఇక భార్యాభర్తల కేసుల్లో కాంపిటెంట్ సాక్ష్యం సేకరణను చేర్చారు!