పార్లమెంటుపై దాడి.. `మూడు నినాదాల` టార్గెట్ ఎవరు?
పార్లమెంటు లోపల అలజడి సృష్టించిన వారు ఇద్దరు యువకులు కాగా, పార్లమెంటు ఆవరణ బయట భాగంలో ఓ మహిళ సహా మరో వ్యక్తి.. పార్లమెంటుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
By: Tupaki Desk | 13 Dec 2023 10:36 AM GMTఅత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉన్న భారత పార్లమెంటులోకి ఇద్దరు దుండగులు ప్రవేశించడమే ఒక ఆశ్చర్యకరమైన విషయమైతే.. వారు టియర్ గ్యాస్ ప్రయోగించడం.. సభలో భయోత్పాతం సృష్టించడం.. మరో దిగ్భ్రాంతికర విషయం. అయితే.. ఈ క్రమంలో పోలీసులు పట్టుకున్న సదరు ఇద్దరు ఆగంతకుల తో పాటు.. పార్లమెంటు బయట కూడా ఇద్దరు భారత్ వ్యతిరేక నినాదాలు చేయడం గమనార్హం.
పార్లమెంటు లోపల అలజడి సృష్టించిన వారు ఇద్దరు యువకులు కాగా, పార్లమెంటు ఆవరణ బయట భాగంలో ఓ మహిళ సహా మరో వ్యక్తి.. పార్లమెంటుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, వీరు చేసిన మూడు నినాదాలు కూడా అత్యంత చర్చనీయాంశం అయ్యాయి. అంతేకాదు.. ఈ నినాదాల వెనుక టార్గెట్ ఎవరు? అనేది కూడా తీవ్ర చర్చనీయాంశం అయింది.
ఇవీ నినాదాలు
+ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించండి
+ చీకటి చట్టాలను రద్దు చేయండి
+ నియంత పాలన రద్దు కావాలి.
ఈ నినాదాలు ఎవరిని ఉద్దేశించి చేశారనేది కూడా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే జమ్ము కశ్మీర్‌కు సంబంధించి రద్దు చేసిన 370 ఆర్టికల్‌ను సుప్రీంకోర్టు సమర్థించడం.. ఆ వెంటనే ఇక్కడ ఎన్నికలకు కేంద్రంలోని మోడీ సర్కారు సమాయత్తం అవుతున్న నేపథ్యంలో అనూహ్యంగా.. ఈ దాడి చోటు చేసుకోవడంతో దీని వెనుక జమ్ము కశ్మీర్ కు చెందిన వారి ప్రమేయం ఉందా? అనే చర్చ సాగుతుండడం గమనార్హం.