అవిశ్వాసంపై చర్చకు ముహూర్తం ఫిక్స్.. విపక్షాల లక్ష్యం క్లియర్!
ఇందులో భాగంగా... ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు ఈ చర్చ జరగనుంది. మూడోరోజైన ఆగస్టు 10వ తేదీన ప్రధాని మోడీ ఈ వ్యవహారం పై ప్రసంగించనున్నారు.
By: Tupaki Desk | 1 Aug 2023 11:19 AM GMTఈశాన్య రాష్ట్రం మణిపుర్ లో జరిగిన సంఘటనలు, వెలుగు చూసిన దారుణాల గురించి తెలిసిందే. ఈసందర్భంగా వెలుగు చూసిన కొన్ని ఘటనలు.. భారతదేశం పై కొన్ని మాయని మచ్చలుగా మిగిలిపోతాయన్నా అతిశయోక్తి కాదని అంటున్నారు. దీంతో ఈ విషయం పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయగా... విపక్షాలు పార్లమెంటు లో అవిశ్వాసం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
ఈ సమయం లో ఇప్పటికే సోమవారం సుప్రీంకోర్టులో మణిపూర్ వ్యవహారం పై వాదనలు ప్రారంభమయ్యాయి కూడా. ఇదే క్రమంలో ఈ నెల లో పార్లమెంట్లులో అవిశ్వాసం పై చర్చ జరగనుంది. ఈ మేరకు లోక్ సభ సభా వ్యవహారాల కమిటీ సమావేశం లో నిర్ణయం తీసుకున్నారు.
అవును... విపక్ష ఎంపీలు ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పై చర్చించేందుకు తేదీలు ఖరారయ్యాయి. ఇందులో భాగంగా... ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు ఈ చర్చ జరగనుంది. మూడోరోజైన ఆగస్టు 10వ తేదీన ప్రధాని మోడీ ఈ వ్యవహారం పై ప్రసంగించనున్నారు.
కాగా.. మణిపుర్ లో జరిగిన ఘోరాల పై ప్రకటన చేసేందుకు మోడీ పార్లమెంట్ కు రావాల ని గత కొద్దిరోజులుగా విపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ కీలక అంశం పై ప్రధాని స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ సమయం లో దేశం లో ఇంత రచ్చ జరుగుతుంటే.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల కు మోడీ గైర్హాజరవ్వడం పై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి! ఈ క్రమంలోనే విపక్షాలు అవిశ్వాస అస్త్రాన్ని ఉపయోగించాయి. దీంతో ఆగస్టు 10న ప్రధాని మోడీ పార్లమెంటు కు గైర్హాజరవ్వడం కుదరదు కాబట్టి... ఆయన చేసే ప్రసంగంపై తీవ్ర ఆసక్తి నెలకొందని తెలుస్తోంది!
వాస్తవానికి లోక్ సభలో అధికార ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయి మెజార్టీ ఉన్న సంగతి తెలిసిందే. విపక్షాల కూటమి "ఇండియా"కు 144 మంది సభ్యులు ఉన్నారు. అయితే... ఈ తీర్మానం పై విజయం సాధించడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ.. మణిపుర్ పై ప్రధాని స్పందించాలనే లక్ష్యంతోనే విపక్షాలు దీనిని ప్రవేశపెట్టాయి.