రేవంత్ ఎఫెక్ట్‌తో.. పార్లమెంటు ఫైట్ తెలంగాణలో ఏకపక్షమేనా?
అయితే.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానంగా రేవంత్ హవా పెద్దగా కనిపిస్తుందనే చర్చసాగుతోంది.
By: Tupaki Desk | 2 Feb 2024 11:30 PM GMTత్వరలోనే జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. అధికార పక్షం కాంగ్రెస్.. రెండు మాసాల ముందుగానే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లి వేదికగా ప్రచార పర్వాన్ని ప్రారంభించింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. పార్లమెంటు నుంచి నరుక్కొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర సమస్యలను, ముఖ్యంగా జలవివాదాలను పార్లమెంటులో ప్రస్తావించడం ద్వారా.. రాష్ట్రంపై తమకు ఉన్న విజన్‌ను ఆయన ప్రచారాస్త్రంగా మలుచుకునే ప్రయత్నం ప్రారంభించారు.
ఇక, బీజేపీ కూడా ఈ ఎన్నికలపై ఫోకస్ చేయనున్నప్పటికీ.. ఇంకా ఏమీ ప్రారంభించలేదు. మరో పార్ట ఎంఐఎం.. కూడా అలానే ఉంది. అయితే.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానంగా రేవంత్ హవా పెద్దగా కనిపిస్తుందనే చర్చసాగుతోంది. తాజాగా నిర్వహించిన ఇంద్రవెల్లి సభకు పోటెత్తిన ప్రజలను చూస్తే.. ఏకపక్షంగా మారినా సందేహం లేదని పరిశీలకులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. "తొలి సభ అదిరిపోయింది" అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. ఇక, సభా వేదికపైనే రేవంత్ .. అనేక హామీలను అమలు చేస్తామని చెప్పారు.
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే ఆయన ప్రస్తావించినా.. వాటిని త్వరలోనే అమలు చేస్తామని చెప్పడంతో సభలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇక, ఇప్పటికే అమలు చేస్తున్న కీలకమైన పథకం.. మహాలక్ష్మి. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్‌కు బాగా కలిసి వస్తుందని ప్రచారం జరుగుతోంది.ఇక, ఇప్పుడు రూ.500లకే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అందివస్తే.. ఒక రేంజ్ఃలో రేవంత్ ప్రభ వెలిగి పోవడంఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే.. ఇదొక మహోగ్రంగా సాగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఏకపక్షంగా రేవంత్ ఫేస్ వాల్యూతో నెట్టుకొ చ్చేసినా.. సందేహం లేదని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఎవరు? అనేది పార్టీప్రకటించలేదు. దీంతో సందేహంగానే కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఓట్లు పడ్డాయి. చాలా మంది బీఆర్ ఎస్ ఎమ్మెల్యే వెయ్యి లోపు మెజారిటీనే దక్కించుకున్నారు. ఇక, ఇప్పుడు సీఎం రేవంత్ వచ్చీరావడంతోనే తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలతో బీఆర్ ఎస్ పార్టీకి ఇబ్బంది తప్పదని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ పద్మవ్యూహాన్ని కేసీఆర్ ఎలా ఛేదిస్తారో చూడాలి.