Begin typing your search above and press return to search.

వ్యూహాల‌కు సాన‌ప‌డుతున్న పార్టీలు.. ఒక్కొక్క‌రిది ఒక్కొక్క బాధ‌

ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన సీఎం కేసీఆర్‌.. నాయ‌కుల‌కు ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

By:  Tupaki Desk   |   2 Dec 2023 11:30 AM GMT
వ్యూహాల‌కు సాన‌ప‌డుతున్న పార్టీలు.. ఒక్కొక్క‌రిది ఒక్కొక్క బాధ‌
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితం మ‌రో 15 గంట‌ల్లో రానుంది. ఈ నేప‌థ్యంలో పార్టీలు వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. అయితే.. ఈ వ్యూహాలు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ర‌కంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల త‌ర్వాత‌.. బీఆర్ ఎస్ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మ‌నే వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో ఆ పార్టీ నాయ‌కులు కొంత మేర‌కు డీలా ప‌డ్డారు. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన సీఎం కేసీఆర్‌.. నాయ‌కుల‌కు ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

అదేస‌మ‌యంలో మెజారిటీ త‌గ్గినా.. ఎలా అధికార పీఠాన్ని ద‌క్కించుకోవాల‌నే వ్యూహాన్ని రెడీ చేసిన‌ట్టు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ``ఔను.. ఎగ్జిట్ పోల్స్ నిజ‌మైనా.. కాకున్నా.. మాకు భ‌యం లేదు. మేం అనుకున్న విధంగా మా ప్లాన్ అమ‌లు చేస్తాం`` అని బీఆర్ ఎస్ మాజీ మంత్రి ఒక‌రు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కేసీఆర్ సీఎం కావ‌డం ఖాయ‌మ‌ని మెజారిటీ నాయ‌కులు అభిప్రాయంతో ఉన్నారు.

ఇంత ధీమా వెనుక ఉన్న ఏకైక కార‌ణం.. గ‌త ఎన్నిక‌ల్లో అనుస‌రించిన స్ట్రాట‌జీనేన‌ని చెబుతున్నారు. 2018 ఎన్నిక‌ల్లో నిజానికి బీఆర్ ఎస్‌కు పూర్తి మెజారిటీ కంటే కూడా.. ఎక్కువ స్థానాలు ద‌క్కాయి. అయిన‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ పార్టీ నుంచి నాయ‌కుల‌ను తీసుకున్నారు. ఇక‌, ఇప్పుడు మెజారిటీ రాక‌పోవ‌డం అనే బెంగ వెంటాడున్న నేప‌థ్యంలో అదే ప్లాన్‌ను కాస్త ముందుగా అమ‌లుచేస్తార‌నేది ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు వేస్తున్న అంచ‌నా.

ఇక‌, కాంగ్రెస్ పార్టీ విష‌యానికి వ‌స్తే.. రెండు ర‌కాల వ్యూహాలు అమ‌లు చేస్తోంది. ఒక‌వైపు.. జంపింగుల‌కు ముకుతాడు వేసేలా.. వారిని అనున‌యిస్తుండ‌డం ఒక‌టైతే.. రెండోది ప‌ద‌వుల పేచీల‌ను స‌ర్దుబాటు చేయ‌డం. వీటిలో ఏ ఒక్క‌టి తేడా వ‌చ్చినా.. తీవ్ర న‌ష్టం త‌ప్ప‌ద‌ని లెక్క‌లు వేసుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం.. వ్యూహాల్లో మార్పులు చేర్పులు కూడా చేసుకుంటూ.. ముందుకు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చివ‌ర‌కు ఈ రెండు పార్టీల వ్యూహాల్లో ఏవిఫ‌లిస్తాయో చూడాలి.