యువతే పార్టీల టార్గెట్టా ?
రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలోని అన్నీ పార్టీలు యువతనే టార్గెట్ చేస్తున్నాయి. అందుకనే తమ మ్యానిఫెస్టోల్లో యూత్ ను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా హామీలను గుప్పించాయి.
By: Tupaki Desk | 20 Nov 2023 5:30 PM GMTరాబోయే ఎన్నికల్లో తెలంగాణాలోని అన్నీ పార్టీలు యువతనే టార్గెట్ చేస్తున్నాయి. అందుకనే తమ మ్యానిఫెస్టోల్లో యూత్ ను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా హామీలను గుప్పించాయి. యువతను ఆకట్టుకోవాలంటే ప్రధానంగా ఉద్యోగాల భర్తీ హామీనే కీలకం అని అందరికీ తెలిసిందే. అందుకనే ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఏడాదిలో అన్ని లక్షల ఉద్యోగాలని, ఇన్ని లక్షల ఉద్యోగాల భర్తీ అని హామీలిచ్చాయి. ఇక్కడ యువత అంటే 18 ఏళ్ళ నుండి 35 ఏళ్ళ మధ్య అని మాత్రమే.
తెలంగాణాలో తాజా లెక్కల ప్రకారం మొత్తం ఓటర్లు 3.14 కోట్లు. ఇందులో 18-19 ఏళ్ళ మధ్య ఓటర్ల సంఖ్య ఏడులక్షలు. అంటే వీళ్ళంతా మొదటిసారి ఓట్లేయబోతున్నారు. ఇక 19 నుండి 45 ఏళ్ళ మధ్య ఉన్న ఓటర్లసంఖ్య సుమారుగా కోటి. అంటే సుమారు కోటి ఓటర్లను టార్గెట్ చేసుకునే ప్రధాన పార్టీలు ఉద్యోగాల భర్తీ మీదే ఎక్కువ హామీలిచ్చాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు ఉద్యోగాల భర్తీపై హామీలిచ్చాయంటే అర్ధముంది.
అయితే పదేళ్ళుగా అధికారంలోనే ఉన్న బీఆర్ఎస్ కూడా ఉద్యోగాల భర్తీనే ప్రధాన హామీగా ఇవ్వటమే విచిత్రంగా ఉంది. ఉద్యోగాల భర్తీలో దారుణంగా ఫెయిలైన బీఆర్ఎస్ కూడా ఇపుడు ఉద్యోగాల కల్పనపైనే పదేపదే మాట్లాడుతున్నారు. ప్రభుత్వ చేతకానితనంవల్లే లక్షలమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు. ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్ పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లు దారుణంగా ఫెయిలయ్యాయి. నోటిఫికేషన్ ఇచ్చిన నిర్వహించిన ప్రతి పరీక్షలోను ప్రశ్నపేపర్ లీకేజలు అయ్యాయి.
గ్రూప్ 1, గ్రూప్ 2 లో భర్తీ చేయాల్సిన అన్నీ కేటగిరీల ఉద్యోగాల రాతపరీక్షలన్నీ రద్దయ్యాయి. ఇది పూర్తిగా అధికారపార్టీ అసమర్ధతనే చెప్పాలి. ఒక్క పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేక చివరకు ప్రభుత్వం చేతులెత్తేసింది. పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యతగా ప్రభుత్వం ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. టీఎస్ పీఎస్సీ ఛైర్మన్, బోర్డు సభ్యులను మార్చమని నిరుద్యోగులు, ప్రతిపక్షాలు ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రభుత్వం మార్చలేదు. దాంతోనే ప్రభుత్వం అసమర్ధత బయటపడింది. అలాంటిది ఇపుడు మళ్ళీ ఉద్యోగాల భర్తీ చేస్తామని కేసీయార్ హామీ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది.