ఎన్నికల వేళ "గోపి"లకు "నాడు - నేడు" కష్టాలు!
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి.
By: Tupaki Desk | 29 April 2024 6:25 AM GMTదేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ముగియడంతో ఇక పూర్తిగా ప్రచారాలపైనే దృష్టిసారించాయి. ఈ సమయంలో... నేతలు చేసుకునే విమర్శలు ప్రతివిమర్శల వేళ ఆసక్తికర పరిణామాలు తెరపైకి వస్తున్నాయి.
ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సందర్భంగా పార్టీలు మారిన నేతలు.. తమ పాత పార్టీలపై చేస్తున్న విమర్శలు ఒకెత్తు అయితే... వారు పార్టీ మారక ముందు.. ఇప్పుడు కొత్తగా చేరిన పార్టీలపై చేసిన విమర్శల తాలూకు పాత వీడియోలు మరొక సమస్యగా మారుతున్నాయి. ఇందులో భాగంగా... శృతిమించి విమర్శలు చేస్తున్న ప్రత్యర్థులకు పలువురు ఇలా సామాధానాలు చెబుతూనే.. ఇరుకున పెడుతున్నారు.
వాస్తవానికి ప్రస్తుతం కాలంలో రాజకీయాల్లో విలువలు వదిలేస్తున్నారనే కామెంట్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి! పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా కండువాలు కప్పి తమ పార్టీల్లో చేర్చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయిందని అంటున్నారు! దీనికి ఆపరేషన్ ఆకర్ష వంటి పేర్లు పెట్టి ప్రజాస్వామ్యాన్ని, ప్రజాభిప్రాయాన్ని అవహేళన చేస్తున్నారని అంటున్నారు. ఈ తరహా నేతలే పక్కపార్టీలో చేరిన తర్వాత.. తమను ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీలపినే విమర్శలు చేస్తుంటారు.
ఇదే సమయంలో.. అప్పటివరకూ ఏ పార్టీపై అయితే తీవ్ర విమర్శలు చేశారొ.. తిరిగి ఆ పార్టీల్లోనే చేరి, అక్కడున్న అధినేత అంత కాదు ఇంతకాదు, అంతటోడు, ఇంతటోడు అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. దీంతో... రాజకీయాల్లో విలువలు రోజు రోజుకీ పడిపోతున్నాయని ఒకరంటే.. విలువలు లేని కార్యక్రమాలనే రాజకీయాలు అంటారనే స్థాయిలో మరికొందరు స్పందిస్తున్నారు. రాజకీయం చేస్తున్నాడంటేనే ఒకరకమైన తప్పు చేస్తున్నాడనే ప్రతిపరాధం, నానార్ధం ధ్వనిస్తున్న రోజులని చెబుతున్నారు.
పైగా ఎన్నికల సీజన్ కావడంతో... ఇలా పార్టీలు మారిన నేతలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న పార్టీని గతంలో తీవ్రంగా విమర్శించడం.. ఇంతకాలం పబ్బం గడుపుకున్న పార్టీనే విమర్శించాల్సి రావడంతో... కుడితిలో పడ్డ ఎలుకల్లా ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు.
ఈ సమయంలో కాస్త ఎక్కువ చేస్తే... పాతవీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ షాకిస్తున్నారంట ప్రత్యర్థులు! దీంతో ఎన్నికల వేళ గోడమీద పిల్లులు (గొపి) లకు "నాడు - నేడు" కష్టాలు వచ్చాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.