Begin typing your search above and press return to search.

చంద్రబాబు.. పవన్ ను ఫాలో అయితే తప్పులు జరగవట!

అవును.. ఇప్పుడు కూటమి నేతలకు కొన్ని విషయాల మీద క్లారిటీ వచ్చేస్తోంది. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.

By:  Tupaki Desk   |   2 July 2024 5:22 AM GMT
చంద్రబాబు.. పవన్ ను ఫాలో అయితే తప్పులు జరగవట!
X

అవును.. ఇప్పుడు కూటమి నేతలకు కొన్ని విషయాల మీద క్లారిటీ వచ్చేస్తోంది. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. జగన్ ఏలుబడి ఆయన్ను ఎంతలా మార్చిందన్న విషయాన్ని ప్రతి సందర్భంలోనూ చూపిస్తున్నారు చంద్రబాబు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని కొత్త బాబును ఏపీ ప్రజలే కాదు తెలంగాణ ప్రజలకు సైతం ఆయన అర్థం చేసుకుంటున్నారు. గతంలో చంద్రబాబుకు ఒక చెడ్డ లక్షణం ఉండేది. చేతిలో అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. చేజారినప్పుడు మరోలా ఉండేవారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారీ ఒకేలాంటి మాటలు చెప్పటం.. పవర్ లోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోవటం చంద్రబాబుకు అలవాటు.

అందుకు భిన్నంగా ఇప్పుడు చంద్రబాబు తీరు ఉంది. గడిచిన ఐదేళ్లలో వివిధ సందర్భాల్లో తానేం చెప్పానో వాటిని యథాతధంగా చేసేస్తున్నారు. ఒక్కటంటే ఒక్క అంశాన్ని సైతం ఆయన మిస్ కావట్లేదు. గతంలో పార్టీ నేతలు ఎవరైనా తప్పు చేస్తే.. ఉపేక్షించేవారు. తొందరపడేవారు కాదు. కాస్త టైమిచ్చేవారు. కానీ.. ఇప్పుడు అందుకు భిన్నంగా నిమిషాల వ్యవధిలో రియాక్టు అవుతున్నారు. చిన్నపాటి డ్యామేజ్ కు సైతం ఆయన అంగీకరించట్లేదు.

ఏపీ రవాణా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సతీమటని హరితారెడ్డి చేసిన హడావుడి ఎంతన్నది వైరల్ వీడియోల్లో తెలుగు వారంతా చూసిందే. తనకు సైతం పోలీసులు ప్రోటోకాల్ ఫాలో కావాలని మండిపడటం.. అధికారాన్ని ప్రదర్శించటం లాంటివి చూసిన వారంతా ఆమె తీరును తప్పు పట్టారు. ఇలాంటి తప్పులే కదా.. జగన్ సర్కారు కొంప ముంచింది కదా అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కనిపించాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు.. వెంటనే మంత్రిని లైన్లోకి తీసుకోవటమే కాదు క్లాస్ పీకి.. వివరణ ఇవ్వాలంటూ షాకిచ్చారు. ఇంత స్పీడ్ గా బాబు యాక్షన్ తీసుకోవటం గతంలో ఎప్పుడూ లేదంటున్నారు.

ఇదే సమయంలో మరో ఆసక్తికర వాదన తెర మీదకు వచ్చింది. అసలు కంటే కొసరు అన్నట్లుగా అధికారం మొత్తానికి కేంద్రంగా ఉన్న చంద్రబాబు.. పవన్ కల్యాణ్ లు ఇద్దరు ఒద్దికగా ఉండటమే కాదు.. బాధ్యతతో ప్రదర్శిస్తుంటే.. కొందరు మాత్రం అందుకు భిన్నంగా అవసరం లేని హడావుడి ప్రదర్శించటం అతి కాక మరేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకొని.. గుడ్డిగా చంద్రబాబు.. పవన్ లను ఫాలో అయిపోతే సరిపోతుందని. అంతకు మించి చేయాల్సింది ఏమీ లేదన్న హితవు పలుకుతున్నారు. మరి.. మంత్రులకు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారా?