Begin typing your search above and press return to search.

బాబుని పదవులు ఎలా అడగాలో తెలియడం లేదు !

పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల విషయంలో ఎవరూ ఆశలు పెట్టుకోవద్దు అని స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   16 July 2024 1:30 AM GMT
బాబుని పదవులు ఎలా అడగాలో తెలియడం లేదు !
X

టీడీపీ కూటమిలో రెండవ అతి పెద్ద పార్టీగా జనసేన ఉంది. కూటమి కట్టడానికి కారణం కూడా జనసేన. ఇంత పెద్ద విజయం అందుకోవడానికి కూడా జనసేన కారణం అని అంటారు. అయితే ఇపుడు జనసేనలోని క్యాడర్ లో ఒక ఆశ కనిపిస్తూంటే అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఆచీ తూచీ అడుగులు వేద్దామని అంటున్నారు.

పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల విషయంలో ఎవరూ ఆశలు పెట్టుకోవద్దు అని స్పష్టం చేశారు. పదవులు వస్తాయి. వాటి కంటే ముఖ్యం నా గుండెలలో మీకు స్థానం ఉందని గుర్తు పెట్టుకోండి అని అన్నారు. అందరూ తనకు చైర్మన్ పదవులే కావాలని అడుగుతున్నారని ఇలా అయితే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

ఒక్క టీటీడీ చైర్మన్ పదవి విషయంలోనే యాభై మంది అడిగారు అని ఆయన అన్నారు. కేవలం ఒకే ఒక్క పదవి ఉందని ఆయన అంటూ అదృష్టవశాత్తు తన కుటుంబంలోని వారు ఎవరూ పదవి అడగలేదు అన్నారు. నాగబాబుకి టీటీడీ చైర్మన్ పదవి అని వచ్చిన ప్రచారం తప్పు అని అన్నారు.

తాను వైసీపీ నేతల మాదిరిగా పదవులు ఇంట్లో వారికి తీసుకోను అని అన్నారు. తమ కుటుంబ సభ్యులకు కూడా అలాంటి ఉద్దేశం లేదని అన్నారు. పదవులు కోసం పనిచేయడం లేదు అన్నది గుర్తుంచుకోవాలని అన్నారు. అదే సమయంలో ఎవరైనా పదవులు కావాల్సిన వారు పార్టీ నేతలను సంప్రదించాలని అయితే పదవులు వస్తాయని ఆశలు పెట్టుకోవద్దు అని సూచించారు.

ఎంతో మంది పదవులు అంటున్నారు కానీ తనకు చంద్రబాబు వద్దకు వెళ్ళి పదవులు ఎలా అడగాలో తెలియడం లేదని పవన్ అన్నారు. అయితే తాను కష్టపడిన ప్రతీ ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటాను అని ఆయన అన్నారు. పదవులు అడగడం ముఖ్యం కాదు దానికి తగైన అర్హత అనుభవం అన్నీ కూడా చూసుకుని అడగాలని ఆయన హితవు చెప్పారు.

తాను ఉప ముఖ్యమంత్రి అవుతాను అనుకోలేదని కానీ అలా అవకాశం వచ్చిందని అన్నారు. కష్టపడితే పదవులు అవే వస్తాయని అన్నారు. తనను పిలిచి మరీ కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఆఫర్ ఇచ్చినా తాను రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఏపీలోనే ఉండడం జరిగిందని పవన్ గుర్తు చేస్తున్నారు.

తనకు ప్రధాని వద్ద ఉన్న గౌరవాన్ని రాష్ట్ర ప్రగతి కోసం ఉపయోగిస్తాను అని ఆయన చెప్పారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి రైల్వే జోన్ రాష్ట్రానికి లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు వంటివి తాను అడుగుతాను అని ఆయన అన్నారు.

మొత్తానికి పదవుల విషయంలో అయితే పవన్ అందరికీ ఇవ్వలేమని పరోక్షంగా తేల్చి చెప్పారు. రాష్ట్రంలో వందకు పైగా కార్పోరేషన్లు ఉన్నాయి. వాటికి చైర్మన్లు ఉంటారు. కొన్ని కార్పోరేషన్ చైర్మన్ పదవులు కేబినెట్ ర్యాంక్ మంత్రి తో సమానం. దాంతో పోటీ ఎక్కువగా ఉంది. అయితే ఇందులో దామాషా ప్రకారం జనసేనకు కొన్ని పదవులు ఇవ్వడానికి టీడీపీ సుముఖంగా ఉంది. అయితే అందరికీ పదవులు అంటే కుదిరే వ్యవహారం కాదని ముందే పవన్ చెప్పడం ద్వారా ఆశావహులకు ఒక అవగాహన కల్పించారు.