Begin typing your search above and press return to search.

లీడర్లు పార్టీలో ఉండడం ముఖ్యం కాదు...పనిచేయడం ముఖ్యం...ఇది జగన్ మిస్ అయ్యారా ?

వైసీపీలో చూస్తే లీడర్లు చాలా మందే ఉన్నారు. ప్రతీ నియోజకవర్గంలో సీనియర్లు జూనియర్లూ పెద్ద సంఖ్యలోనే కనిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Aug 2024 12:30 PM GMT
లీడర్లు పార్టీలో ఉండడం ముఖ్యం కాదు...పనిచేయడం ముఖ్యం...ఇది జగన్ మిస్ అయ్యారా ?
X

వైసీపీలో చూస్తే లీడర్లు చాలా మందే ఉన్నారు. ప్రతీ నియోజకవర్గంలో సీనియర్లు జూనియర్లూ పెద్ద సంఖ్యలోనే కనిపిస్తున్నారు. అలాగే లోకల్ బాడీస్ ఎన్నికల్లో పంచాయతీ వార్డు మెంబర్ నుంచి కూడా వైసీపీ వారే గెలిచారు. అఫ్ కోర్స్ ఇపుడు వారికే డిమాండ్ వచ్చి పడుతోంది. వారంతా అధికార కూటమి వైపుగా వెళ్తున్నారు.

ఇక మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు ఇలా చాలా మంది లిస్ట్ ఉంది. వీరంతా ప్రస్తుతానికి వైసీపీలోనే ఎక్కువ మంది ఉన్నారు. అయితే వీరు ఎందుకు ఉన్నారు అన్నది మాత్రం అర్థం కావడం లేదు అంటున్నారు. వైసీపీ ఓటమి పాలు అయిన తరువాత నుంచి అత్యధిక శాతం లీడర్లు సైలెంట్ అయిపోయారు.

మరి వారి అలోచనలు ఏమిటో ఎవరికీ తెలియడం లేదు అని అంటున్నారు. వైసీపీలో కంటిన్యూ అవ్వాలని ఉంటే ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి ప్రజా సమస్యల మీద ప్రస్తావించాలి. కానీ గమ్మున ఉంటున్నారు. మరో వైపు వైసీపీ అధినాయకత్వం నాయకులు వైసీపీ గడప దాటి వేరే పార్టీలలో చేరడం లేదు కదా అని ఆలోచించి సంతోషిస్తూ ఉండవచ్చు అని అంటున్నారు.

కానీ లీడర్లు పార్టీలో ఉండడం కాదు కదా, వారు పనిచేయాలి. మరి అలా వైసీపీలో పనిచేసే నాయకులు ఎంతమంది ఏమిటి అన్నది జగన్ బేరీజు వేసుకుంటున్నారా అన్నదే చర్చగా ఉంది. మరో వైపు చూస్తే వైసీపీ ఎందుకు ఓడింది అన్నది అర్ధం కాక ఆ పార్టీ హై కమాండ్ తలలు బద్ధలు కొట్టుకుంటోంది. అదే సమయంలో అసలు లాజిక్ ని వైసీపీ పెద్దలు మిస్ అయ్యారు అని అంటున్నారు. మేము డబ్బులు జనాలకు ఇచ్చాం, నేరుగా నగదు బదిలీ చేశాం, వారి ఖాతాలో నగదు చేరింది కాబట్టి గెలుపు ఖాయం అని భ్రమలలో జగన్ ఉండిపోయారు అని అంటున్నారు.

పార్టీ సలహాదారులు కూడా ఈ విషయంలో ఎలాంటి కేసు స్టడీ చేసి హై కమాండ్ కి నివేదిక ఇవ్వలేకపోయారు అని అంటున్నారు. ఇక మనిషికి వెన్నుపూస ఎంత ముఖ్యమో పార్టీకి క్యాడర్ అంతే ముఖ్యం. కానీ వైసీపీ హై కమాండ్ మాత్రం ఆ విధంగా ఆలోచించడం లేదు అనే అంటున్నారు. పార్టీలో అందరూ ఉన్నారు. క్యాడర్ ఉంది. లీడర్లు ఉన్నారు అని ధీమా పడుతోంది అని అంటున్నారు.

వైసీపీ 151 సీట్లను అసెంబ్లీ ఎన్నికల్లో తెచ్చుకుంది. అలాగే 22 మంది ఎంపీలు గెలిచారు. అంతే కాదు, లోకల్ బాడీ ఎన్నికల్లో ఏకంగా 90 శాతం మంది వైసీపీ తరఫున గెలిచారు. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వైసీపీ పటిష్టంగా ఉండి ఉండాలి. కానీ మరి ఇంత దారుణంగా ఎందుకు ఓడిపోయింది అన్నది ఏమైనా లోతైన విశ్లేషణ చేశారా అన్న చర్చ అయితే వస్తోంది.

అంటే పార్టీలో పేరుకు ఉన్నారు కానీ ఎవరూ పనిచేయలేదని అర్ధం అయిపోతోంది కదా అనే అంటున్నారు. లేకపోతే పార్టీకి ఇంత దారుణమైన ఫలితాలు ఎలా వస్తాయన్నది కూడా ప్రశ్న ముందుకు వస్తోంది. అంటే వారికి పార్టీలో తగిన గౌరవం ఇవ్వలేదు, పార్టీ కోసం ప్రాణం పెట్టి గత పదేళ్ళుగా పాటు పడి ఆర్ధికంగా పూర్తిగా దెబ్బ తిన్నా కూడా పార్టీ ఏ మాత్రం పట్టించుకోలేదు అన్న మాట వినిపిస్తోంది.

అందుకే వారు కూడా పార్టీని పట్టించుకోలేదు అని కూడా అంటున్నారు. ఈ రోజుకి చూసినా పార్టీలో క్యాడర్ సైలెంట్ గానే ఉంది. వారి విషయంలో హై కమాండ్ ఏమి ఆలోచిస్తోందో కూడా తెలియడం లేదు. పార్టీ ఇంతటి దారుణమైన ఫలితం అందుకున్నా క్యాడర్ ని పిలిచి మీటింగులు పెడితే వారిలో కొత్త ఉత్సాహం వచ్చేది అని అంటున్నారు.

ఏపీలో ప్రతీ జిల్లా నుంచి ముందుగా క్యాడర్ ని పిలిచి వారితోనే పార్టీ రివ్యూ నిర్వహించి ఉండాలని అంటున్నారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ పరిస్థితి కానీ పార్టీలో జరుగుతున్న పరిస్థితులు కానీ వారి కంటే ఎవరికీ తెలియవు. కానీ నాయకులతో మాత్రమే పార్టీ పైపైన సమీక్షలు చేసి ఉఊరుకుంది అని అంటున్నారు.

ఇలాగైతే వైసీపీ క్యాడర్ మరింతగా డీ మోరలైజ్ అవుతుంది అని అంటున్నారు. ఇక పార్టీలో లీడర్లు ఈ రోజుకు ఉన్నా సరైన ఆఫర్లు వస్తే వారు కూడా జంప్ అవుతారు అని అంటున్నారు. అపుడు వైసీపీ భారీ షాక్ తినే సీన్ ఉంటుందని అందుకే దాని కంటే ముందే జాగ్రత్త పడి తగిన యాక్షన్ ప్లాన్ ని రూపొందించుకోవాల్సి ఉంది అని అంటున్నారు.