Begin typing your search above and press return to search.

ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ ?

న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అరవింద్ కేజ్రీవాల్‌ ని 12 వేల ఓట్ల తేడతో బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ ఓడించారు.

By:  Tupaki Desk   |   8 Feb 2025 7:55 AM GMT
ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ ?
X

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దూసుకుని పోతుంది. కాషాయం ప్రభంజం ముందు ఆప్ నిలువలేక చతికిలపడింది. సాక్ష్యాత్తూ ఆప్ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ ఓటమిని చవి చూడడం ఆశ్చర్యం కలిగించింది.

న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అరవింద్ కేజ్రీవాల్‌ ని 12 వేల ఓట్ల తేడతో బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ ఓడించారు. దాంతో పర్వేష్ వర్మ పేరు మారుమోగుతోంది. అంతే కాదు జెయింట్ కిల్లర్ గా రికార్డుకు ఎక్కిన ఆయనే ఢిల్లీకి కాబోయే సీఎం అని అంటున్నారు.

అరవింద్ కేజ్రీవాల్ ని ఓడించిన అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాని ప్రవేష్ వర్మ కలవడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఢిల్లీలో కాబోయే సీఎం గా ఆయన పేరు ప్రచారంలో ఉంది. అంతే కాదు కేంద్ర బీజేపీ పెద్దలు కూడా ఆయనకే చాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు

ఇక పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ సాదా సీదా నాయకుడు కాదు, ఆయనది రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి సాహెబ్ సింగ్ వర్మ ఢిల్లీకి నాలుగో సీఎం గా పనిచేశారు. ఆయన 1996 నుంచి 1998 దాకా రెండేళ్ళ పాటు సీఎం గా ఉన్నారు. ఆయన బీజేపీలో కీలకమైన నాయకుడు, జాతీయ పార్టీకి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.

ఆయన ఢిల్లీలో బీజేపీని నిలబెట్టడానికి ఎంతో కృషి చేశారు. ఆయన 2007 మరణించారు. అనంతరం ఆయన రాజకీయ వారసుడిగా వచ్చిన పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ 2013లో ఢిల్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఆయన పశ్చిమ ఢిల్లీ నుంచి లోక్ సభకు పోటీ చేసి తొలిసారి ఎంపీ అయ్యారు. ఆ తరువాత 2019లో అదే పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేసి గెలిచారు.

పదేళ్ళ పాటు ఆయన ఎంపీగా ఉన్నా 2024లో ఎంపీ టికెట్ ని పార్టీ ఇవ్వలేదు. ఎందుకు అన్న చర్చ నాడు నడచింది. అయితే వ్యూహాత్మకంగా బీజేపీ ఆయనను అసెంబ్లీ బరిలోకి దించేందుకే ఇదంతా చేసింది అని అంటున్నారు.

దాంతో ఢిల్లీ అసెంబ్లీ నుంచి తాజా ఎన్నికల్లో పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. దాంతో ఆయన పేరుని బీజేపీ అధినాయకత్వం సీఎం అభ్యర్ధిగా పరిశీలిస్తోంది అని అంటున్నారు. సాహెబ్ సింగ్ వర్మ బీజేపీ అగ్ర నేతలకు సమకాలీనుడు. దాంతో ఆయన కుమారుడికి చాన్స్ ఇవ్వాలని బీజేపీ ఆలోచిస్తోందని సమర్ధుడిగా పార్టీ విధేయుడిగా విద్యావంతుడిగా ఉన్న పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ తదుపరి సీఎం అని అంటున్నారు. ఆయనకు ఈ చాన్స్ ఇవ్వడం ద్వారా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని ఫ్రెష్ లుక్ తో ఢిల్లీలో తన సరికొత్త రాజకీయ ప్రస్థానం కొనసాగించాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ ఢిల్లీ కొత్త సీఎం అని అంతా అంటున్నారు.