Begin typing your search above and press return to search.

జెయింట్ కిల్లరే ఢిల్లీ కొత్త సీఎం?

ఢిల్లీకి కాబోయే సీఎం ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చిందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   10 Feb 2025 10:17 AM IST
జెయింట్ కిల్లరే ఢిల్లీ కొత్త సీఎం?
X

టార్గెట్ ఒకసారి డిసైడ్ అయ్యాక.. దాన్ని సాధించే వరకు నిద్ర పోని రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ మారింది. ఈ పార్టీకి ఎప్పుడైతే మోడీషాలు కన్నుచెవులు అయ్యారో.. అప్పటి నుంచి ఆ పార్టీ రూపురేఖలు మాత్రమే కాదు.. తీరుతెన్నుల్లోనూ మార్పులు వచ్చేశాయి. మోడీకి ముందు బీజేపీకి.. మోడీ చేతుల్లోకి పార్టీ వచ్చిన తర్వాత నుంచి కొట్టొచ్చినట్లుగా ఆ పార్టీ తీరులో మార్పు వచ్చిందని చెప్పాలి. మొత్తంగా చూస్తే.. ఢిల్లీ రాష్ట్ర కోటను సొంతం చేసుకోవాలన్న కలను మోడీషాలు నిజం చేశారు.

అంచనాలకు తగ్గట్లే భారీ విజయాన్ని సాధించిన బీజేపీ.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని డిసైడ్ చేయనున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆదివారం చోటు చేసుకున్న పరిణామాల్ని చూసినప్పుడు.. ఢిల్లీకి కాబోయే సీఎం ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చిందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న అతిశీ మార్లేనా తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అందించిన తర్వాత ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నోటిఫికేషన్ విడుదల తర్వాత ఆప్ కీలక నేత కేజ్రీవాల్ ను ఓడించి జెయింట్ కిల్లర్ గా ఆవిర్భవించిన పర్వేష్ వర్మ గవర్నర్ సక్సేనాతో భేటీ కావటం.. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవటం ద్వారా.. తదుపరి సీఎం ఆయనే అన్న వాదనకు బలం చేకూరుతోంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. పర్వేష్ వర్మ తండ్రి సాహెబ్ సింగ్ వర్మ బీజేపీ తరఫున ఢిల్లీకి ఆఖరి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన కొడుకుతో బీజేపీ ఢిల్లీ ఇన్నింగ్స్ మళ్లీ షురు కానుందన్న మాట వినిపిస్తోంది. ఆమ్ ఆద్మీ కన్వీనర్ కేజ్రీవాల్ ను 4089 ఓట్ల తేడా విజయం సాధించిన వర్మ.. 2013లో అసెంబ్లీకి.. ఆ తర్వాత 2014, 2019లో ఎంపీ ఎన్నికల్లో ఢిల్లీ వెస్ట్ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.

ఇంతకీ పర్వేష్ వర్మ ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. ఢిల్లీలోని పవర్ ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీల్లో ఒకటి వర్మ కుటుంబం. పంజాబీ జాట్ నేతగా సుపరిచితుడు. రాష్ట్రీయ స్వయం అనే ఎన్జీవోను నిర్వహిస్తున్నారు. ఆయన తండ్రి బీజేపీ ఆఖరి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆయన మామ ఆజాద్ సింగ్ సైతం ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా వ్యవహరించారు.

పర్వేష్ భార్య స్వాతి సింగ్ మధ్యప్రదేశ్ బీజేపీ నేత విక్రమ్ వర్మ కుమార్తె. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. ఒక కుమారుడు ఉన్నారు. తాజాగా తమ తండ్రి సాధించిన విజయంపై ఆయన ఇద్దరు కుమార్తెలు త్రిష.. సనిధిలు ఓటర్లకు థ్యాంక్స్ చెప్పటమే కాదు.. అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తికి ఢిల్లీ ప్రజలురెండో ఛాన్సు ఇచ్చే తప్పు ఎప్పటికి చేయరంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. తన తండ్రి గెలుపుపైనే కాదు.. పార్టీ మీదా తమకు నమ్మకం ఉందని.. తాము ఎదురు చూస్తున్న సమయం వచ్చేసిందని వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది.