పాస్టర్ ప్రవీణ్ మరణంపై సంచలన ప్రకటన చేసిన పోలీసులు
పాస్టర్ ప్రవీణ్ కుమార్.. మృతి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 12 April 2025 8:37 AMపాస్టర్ ప్రవీణ్ మృతి ప్రమాదవశాత్తే సంభవించిందని, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించారు.
పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారని, పలువురు సాక్షులను విచారించామని, సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించామని ఐజీ తెలిపారు. ప్రవీణ్ ప్రయాణించిన మార్గంలో ఆయన పలువురితో మాట్లాడినట్లు గుర్తించామన్నారు. ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన కొట్టిపారేశారు. పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం ఉందని ప్రవీణ్ కుటుంబ సభ్యులు చెప్పినట్లు ఐజీ తెలిపారు.
ప్రవీణ్ హైదరాబాద్, కోదాడ, ఏలూరులోని మద్యం దుకాణాలకు వెళ్లారని దర్యాప్తులో తేలిందన్నారు. ప్రయాణంలో ఆయనకు మూడుసార్లు చిన్నపాటి ప్రమాదాలు జరిగాయని ఆయన వెల్లడించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ప్రకారం ప్రవీణ్ శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని ఐజీ తెలిపారు.
ప్రవీణ్ తన ప్రయాణంలో ఆరుసార్లు యూపీఐ ద్వారా చెల్లింపులు చేశారని పోలీసులు గుర్తించారు. కీసర టోల్ ప్లాజా వద్ద ఆయన అదుపు తప్పి కింద పడిపోయారని, అంబులెన్స్ - వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయం అందించారని ఐజీ వివరించారు. రామవరప్పాడు జంక్షన్ వద్ద ఒక ఆటో డ్రైవర్ ప్రవీణ్ పరిస్థితిని గమనించారని, ట్రాఫిక్ ఎస్సై సూచన మేరకు ఆయన రెండు గంటలపాటు పార్కులో నిద్రపోయారని తెలిపారు. ఆరోగ్యం బాగోలేదని, వెళ్లవద్దని చెప్పినా వినకుండా ప్రవీణ్ బయలుదేరారని ఐజీ పేర్కొన్నారు. హెడ్‌లైట్ పగిలిపోవడంతో ఆయన కుడివైపు బ్లింకర్ వేసుకుని ప్రయాణించారని తెలిపారు.
ఏలూరులో ప్రవీణ్ మద్యం కొనుగోలు చేశారని, మద్యం దుకాణానికి వచ్చినప్పటికే ఆయన కళ్లజోడు పగిలిపోయిందని ఐజీ వెల్లడించారు. కొంతమూరు పై వంతెన పై కూడా ఆయన వేగంగా వెళ్లారని తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలంలో ప్రవీణ్ యొక్క బుల్లెట్ వాహనం రోడ్డు పక్కకు దూసుకుపోయిందని, ఏ ఇతర వాహనం కూడా దానిని ఢీకొనలేదని ఆయన స్పష్టం చేశారు. బైక్ , పక్కనే ఉన్న కారుకు మధ్య చాలా దూరం ఉందని ఆయన తెలిపారు. ప్రమాద స్థలంలో రోడ్డు పనులు జరుగుతున్నాయని, అక్కడ కంకర రాళ్లు ఉన్నాయని ఐజీ చెప్పారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం.. బుల్లెట్ పైకి ఎగిరి పాస్టర్ ప్రవీణ్ పై పడిందని తేలిందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బండి ఫోర్త్ గేర్‌లో ఉందని, ఇతర వాహనాలను ఢీకొనలేదని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు.
ఈ ఆధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ మృతి పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిందని నిర్ధారించామని ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు.