Begin typing your search above and press return to search.

పాస్టర్ ప్రవీణ్ మృతి... తెరపైకి సంచలన విషయాలు!

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 March 2025 7:40 AM
పాస్టర్  ప్రవీణ్  మృతి... తెరపైకి సంచలన విషయాలు!
X

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తొలుత ఇది యాక్సిడెంట్ అన్నట్లుగా ప్రచారం జరిగినప్పటికీ.. ఇది ప్రమాదం మాత్రం కాదని, దీనిపై పలు అనుమానాలున్నాయని.. ఈ బైక్ వెనుక వచ్చిన కార్లు, ఆయన గుండెలపై ఉన్న పాదరక్షల ముద్రలు.. దీనిపై పలు అనుమానాలు రేకిత్తిస్తున్నాయని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

సికింద్రబాద్ నుంచి ప్రవీణ్ కుమార్ తూర్పు గోదావరి జిల్ల చాగల్లులో జరిగే క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు సోమవారం సాయంత్రం బైక్ పై బయలుదేరగా.. మంగళవారం ఉదయం రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్ద రోడ్డు పక్కన విగతజీవిగా పడి ఉన్నారు. అయితే... తొలుత దీన్ని రోడ్డు ప్రమాదంగా భావించారు!

అయితే... ఇది రోడ్డు ప్రమాదం కాదని.. ఈ ఘటనపై పలు అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు, క్రైస్తవ సంఘాలు తెలపడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో వీడియో తీస్తూ పోస్టుమార్టం చేస్తామని చెప్పడంతో.. మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ.. రెండున్నర గంటల పాటు జరిగింది.

ఈ సందర్భంగా స్పందించిన కేఏ పాల్... ప్రవీణ్ మరణం ప్రమాదవశాత్తు జరిగిందంటే నమ్మలేమని.. ఎక్కడో చంపి ఇక్కడ పడేసి వెళ్లారని.. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో... డిప్యూటీ సీఎం పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని పాల్ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో తొలుత మాజీ ఎంపీ హర్షకుమార్ రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు!

తెరపైకి షాకింగ్ విషయం!:

ఈ సందర్భంగా స్పందించిన జిల్లా ఎస్పీ సంచలన కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... తమ దగ్గరున్న సాక్ష్యాల ఆధారంగా ప్రవీణ్ బైక్ 24న రాత్రి 11:31కి కొవ్వూరు టోల్ ప్లాజాను దాటుతున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యిందని.. తర్వాత ఘటనా స్థలం ఎదురుగా పెట్రోల్ బంకులోని సీసీ కెమెరాలో రాత్రి 11:42కి ఓ కారుతో పాటు మొత్తం ఐదు వాహనాలు ప్రవీణ్ ప్రయాణిస్తున్న బైక్ దాటుకుని వెళ్లినట్లు రికార్డయ్యిందని అన్నారు.

ఇదే సమయంలో.. ఘటనా స్థలంలో లభ్యమైన ఆధారాలను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని.. ఈ కేసులో ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణకూ రాలేఖపోతున్నామని పేర్కొన్నారు. వదంతులు నమ్మకుండా.. ఎవరివద్దైనా ఎలాంటి ఆధారాలు ఉన్నా కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ కు ఇవ్వాలని సూచించారు. క్రైస్తవ మతపెద్దలు, పాస్టర్లు, యువత సంయమనం పాటించాలని కోరారు.

ఇక ప్రవీణ్ పగడాల మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. ఇదే సమయంలో... ప్రవీణ్ మృతిపై నిష్పాక్షిక, పారదర్శక విచారణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. కొవ్వూరు డీఎస్పీకి విచారణ బాధ్యతలు అప్పగించామని హోంమంత్రి అనిత తెలిపారు.

ఇదే క్రమంలో... ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఇందులో భాగంగా... పాస్టర్ ప్రవీణ్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నందున ప్రభుత్వం నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా... ప్రవీణ్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన... మృతుని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.