Begin typing your search above and press return to search.

వైఎస్సార్ విధేయుడు ఫ్యాన్ పార్టీకి దూరం అవుతారా ?

వైఎస్సార్ కి ఆయన వీర విధేయుడు. అందుకే వైఎస్సార్ రెండవసారి 2009లో అధికారంలోకి వచ్చాక ఆయనకు కేబినెట్ మంత్రి పదవిని ఇచ్చి గౌరవించారు.

By:  Tupaki Desk   |   5 Dec 2024 3:35 AM GMT
వైఎస్సార్ విధేయుడు ఫ్యాన్ పార్టీకి దూరం అవుతారా ?
X

వైఎస్సార్ కి ఆయన వీర విధేయుడు. అందుకే వైఎస్సార్ రెండవసారి 2009లో అధికారంలోకి వచ్చాక ఆయనకు కేబినెట్ మంత్రి పదవిని ఇచ్చి గౌరవించారు. అలా ఉమ్మడి విశాఖ జిల్లాకు ఏకైక మంత్రిగా ఆయన చాలా కాలం పనిచేసారు. ఆయన ఎవరో కాదు పసుపులేటి బాలరాజు.

ఆయన ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఆయన పక్కా కాంగ్రెస్ వాది, దివంగత నేత ద్రోణం రాజు సత్యనారాయణ శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన గతంలో చింతపల్లి నుంచి తరువాత పాడేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇక 2014లో కాంగ్రెస్ పతనం అయిన తరువాత ఆయన కొన్నాళ్ళ పాటు జనసేనలో ఉన్నారు. 2019లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన వైసీపీలో చేరారు. ఆయన కుమార్తె జెడ్పీటీసీ అయింది. చైర్మన్ పదవి తన కుమార్తెకు దక్కుతుందని ఆశలు పెట్టుకున్నా వైసీపీ అధినాయకత్వం వేరే వారికి చాన్స్ ఇచ్చింది.

దాంతో అప్పట్లోనే కొంత అసంతృప్తికి గురి అయిన బాలరాజు 2024 ఎన్నికల్లో పాడేరు నుంచి తనకు కానీ తన కుమార్తెకు కానీ టికెట్ దక్కుతుందని భావించారు. అయితే అది దక్కకపోవడంతో ఆయన నాటి నుంచి కొంత సైలెంట్ అయ్యారు. వైసీపీ ఘోర ఓటమి తరువాత ఆయన పెద్దగా కనిపించడం లేదు. పార్టీ సమావేశాలు జరిగినా అయన ఎక్కడా ఉన్నట్లుగా అయితే తెలియడం లేదు.

ఈ నేపధ్యంలో ఒక ప్రచారం అయితే సాగుతోంది. బాలరాజు వైసీపీ పట్ల అసంతృప్తితో ఉన్నారని ఆయన పక్క చూపులు చూస్తున్నారు అన్నదే ఆ ప్రచారం. ఆయన తన కుమార్తె రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని అడుగులు వేస్తారని అంటున్నారు.

ఆయన జనసేన నుంచి బయటకు వచ్చేశారు కాబట్టి టీడీపీలోకి వెళ్తారు అన్న టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. విశాఖ ఏజెన్సీలో టీడీపీ గెలుపు బాటను పట్టి దశాబ్దాలు అవుతోంది. సరైన లీడర్ షిప్ ఉన్నా పెద్ద దిక్కుగా ఉండి గైడెన్స్ ఇచ్చే వారు లేరు. ఆ లోటుని బాలరాజు తీరుస్తారు అనుకుంటే టీడీపీ ఆయనను ఆహ్వానించవచ్చు అని అంటున్నారు.

బాలరాజు సైతం తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ వారసురాలికి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు. పాడేరులో చూస్తే గిడ్డి ఈశ్వరికి గత రెండు దఫాలుగా టీడీపీ టికెట్ ఇచ్చినా ఆమె ఓటమి పాలు అయ్యారు. దాంతో వచ్చే ఎన్నికల్లో కొత్త ముఖానికి చాన్స్ ఇవ్వాలని ఆ పార్టీ చూస్తోంది.

దాంతో బాలరాజు తన కుమార్తెకు ఆ విధంగా టికెట్ సాధించుకోవచ్చు అని చూస్తున్నారు అని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే ఆయన సైకిలెక్కేస్తారు అని విశాఖ ఏజెన్సీలో అయితే ప్రచారం సాగుతోంది. వైఎస్సార్ కి వీర విధేయులు అయిన వారు అంతా ఇపుడు వైసీపీని వీడిపోతున్నారు. ఆ బాటలో బాలరాజు కూడా ఉంటారని అంటున్నారు. అదే జరిగితే ఏజెన్సీలో వైసీపీకి కొంత నష్టం తప్పదని అంటున్నారు.