ఇంతకాలానికి చెంపలు వేసుకున్న పతంజలి
వెనుకా ముందు చూసుకోకుండా తమ ఉత్పత్తుల గురించి గొప్పలు చెప్పే విషయంలో పతంజలి ట్రాక్ రికార్డు వేరన్న విమర్శలు తరచూ ఎదుర్కొంటోంది
By: Tupaki Desk | 22 March 2024 5:10 AMవెనుకా ముందు చూసుకోకుండా తమ ఉత్పత్తుల గురించి గొప్పలు చెప్పే విషయంలో పతంజలి ట్రాక్ రికార్డు వేరన్న విమర్శలు తరచూ ఎదుర్కొంటోంది. ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థకు చెందిన పలు ఉత్పత్తులకు సంబంధించిన నాణ్యతపై తరచూ ఏదో ఒక ఆరోపణ వినిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ ఆయుర్వేద సంస్థ తాజాగా సుప్రీంకోర్టుకు సారీ చెప్పింది. అంతేకాదు.. తప్పుదోవ పట్టించేలా ప్రకటనల్ని ఇవ్వమంటూ స్పష్టం చేసింది.
న్యాయవ్యవస్థ మీద తమకు అమితమైన గౌరవం ఉందన్న పతంజలి సంస్థ.. గతంలో తాము జారీ చేసిన ప్రకటనలపై విచారం వ్యక్తం చేసింది. తమ ఉత్పత్తులను వాడకం ద్వారా ప్రజలు ఆరోగ్యకర జీవన విధానాన్ని గడపాలన్నదే తమ సంస్థ ఉద్దేశంతో సంస్థ ఎండీగా వ్యవహరిస్తున్న ఆచార్య బాలక్రిష్ణ పేర్కొన్నారు. ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంను ఆశ్రయించింది.
దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. అసత్య.. తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఇకపై అలాంటి ప్రకటనలు ఉండవని సంస్థ తరఫు లాయర్ కోర్టుకు హామీ ఇవ్వటం తెలిసిందే. గతంలోనే పతంజలికి సంబంధించిన ఉత్పత్తుల నాణ్యతపై ఫిర్యాదులు రావటం.. కేసులు నమోదు చేశారు. తరచూ ఏదో ఒక అంశంలో న్యాయ విచారణను ఎదుర్కొనే అలవాటున్న ఈ సంస్థ ఇకపై ఎలా ఉంటుందో చూడాలి.