నా బుక్ తీశానంటే నువ్వు ఉండవ్.. మంత్రి లోకేశ్ పై కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు
తనకు ఉన్న దైవ బలంతో శపిస్తే వంద శాతం జరిగి తీరుతుందని అన్నారు.
By: Tupaki Desk | 5 Feb 2025 7:32 AM GMTప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పై ఇష్టానుసారం నోరుపారేశుకున్నారు. తాను తలచుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయగలనని, లోకేశ్ తనకో లెక్కకాదంటూ హెచ్చరించారు. తనకు ఉన్న దైవ బలంతో శపిస్తే వంద శాతం జరిగి తీరుతుందని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం చేద్దామని ఎప్పటికప్పుడు అభాసుపాలవుతున్న పాల్.. విశాఖలో నోటికొచ్చినట్లు మాట్లాడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే జైలుకు వెళ్లి ఉండేవాడని అంతా గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం హుందాగా వ్యవహరిస్తుండటం వల్ల ఆయన మంచి, చెడు చూడకుండా స్థాయికి మించి మాట్లాడుతున్నాడని అంటున్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ ను తనతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చిన కేఏ పాల్.. గతంలో తన శాపం వల్లే వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం చెందారని చెప్పడాన్ని టీడీపీ సోషల్ మీడియా తెరపైకి తెచ్చింది. ఎప్పటికప్పుడు తెలుగు రాజకీయాల్లో సందర్భంలేని వ్యాఖ్యలు చేసే కేఏ పాల్ ను పొలిటికల్ కమేడియన్ అంటూ టీడీపీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు.
మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ పేరిట అందరినీ బెదిరిస్తున్నారని చెప్పిన కేఏ పాల్.. వైసీపీ నేతలను వెనకేసుకురావడం విడ్డూరంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ శాంతి దూతగా తనకు తాను చెప్పుకుని నిత్యం అశాంతితో ఆయన జీవిస్తుంటాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు.