పవన్ నోట.. ''బైబిల్'' మాట.. నిజం!
ఇదే విషయాన్ని బైబిల్‌లోనూ చెప్పారని తెలిపారు.
By: Tupaki Desk | 12 April 2024 12:30 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోట.. 'బైబిల్' మాట వినిపించింది. తాజాగా పి.గన్నవరం నియోజకవర్గం లో మూడు పార్టీల కూటమి నిర్వహించిన ప్రజాగళం సభలో పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. బైబిల్ ప్రస్తావన తీసుకువచ్చారు. యువత విషయాన్ని ప్రస్తావిస్తూ.. వారికి నైపుణ్యాభివృ ద్ధిని నేర్పిస్తామని చెప్పారు. ఇదే విషయాన్ని బైబిల్‌లోనూ చెప్పారని తెలిపారు.
''బైబిల్‌లో ఒక మాట ఉంది. చేపలు పంచడం కాదు.. చేపలు పట్టే విధానం నేర్పాలి. దీనినే నేను అనుస రిస్తాను. ఇలానే యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించేందుకు ప్రయత్నిస్తాం. వారి కాళ్లపై వాళ్లు నిలబడేలా.. జీవితంలో ఒకరిపై ఆధారపడకుండా ఉండేలా ప్రయత్నిస్తాం'' అని పవన్ అన్నారు. తన జీవితంలోనూ స్కిల్ నేర్చుకున్నానని పవన్ చెప్పారు. అయితే.. అది తనకు అన్నయ్య చిరంజీవి వల్ల వచ్చిందన్నారు.
ప్రస్తుత యువతలో అనేక క్వాలిటీస్ ఉన్నాయని.. వాటికి కొంత శిక్షణ ఇస్తే.. వారు మెరుగైన ఉద్యోగాలు సొంతం చేసుకోవడంతోపాటు ఉపాధి పరిశ్రమలు పెట్టకుని పదిమందికి ఉపాధి కల్పించే స్తితికి వస్తారని పవన్ చెప్పారు. ఇక, సామాజిక వర్గాల అన్యోన్యతపై మాట్లాడిన పవన్.. కాపులు, శెట్టి బలిజలు, మాల, మాదిగలు అందరూ కలిసి ఉండాలని చెప్పారు. అదేసమయంలోచాలా మంది పొత్తులు ఎందుకు.. అని ప్రశ్నిస్తున్నారన్న పవన్.. దీనికి రీజన్లు చెప్పారు.
మన శరీరంలో అనేక రక్తనాళాలు ఉన్నాయన్న ఆయన.. ఒకే రక్తనాళం ద్వారా జీవిస్తామంటే సరిపోదన్నా రు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు ఒక్కరే ఒంటరిగా ఉంటే న్యాయం జరగదని చెప్పారు. అందుకే తాము అనేక త్యాగాలు చేసి.. చేతులు కలిపినట్టు చెప్పారు. మూడు పార్టీల పొత్తును త్రివేణి సంగమంతో పవన్ పోల్చడం గమనార్హం. తమ పొత్తు కేవలం రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రజల కోసమేనని వివరించారు. దీనిలో ఎలాంటి స్వార్థం తమకు లేదన్నారు.