డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ.. ఏం చేస్తున్నట్టు.. ?
పోనీ.. ఢిల్లీ వెళ్లారు..రాష్ట్రం గురించి ఏదో చర్చించారు అనుకునేందుకు ఆయన ఢిల్లీలోనూ లేరు.
By: Tupaki Desk | 5 Feb 2025 9:30 AM GMTఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఇదీ..ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్న విషయం. అటు అమరావతిలో ఆయన కనిపించడం లేదు. నిత్యం సమీక్షలు.. సమావేశాలు.. వచ్చి పోయే వారిని కలుసుకోవడాలు వంటివి లేవు. పోనీ.. ఢిల్లీ వెళ్లారు..రాష్ట్రం గురించి ఏదో చర్చించారు అనుకునేందుకు ఆయన ఢిల్లీలోనూ లేరు. మరి సినిమా షూటింగులకు వెళ్లారా? అనేది కూడా సందేహంగానే ఉంది.
పవన్ కల్యాణ్ సినిమా షూటింగులకు హాజరై ఉంటే.. టాలీవుడ్‌లో ఏదో ఒక మూల నుంచి వార్తలు వచ్చేవి. కానీ, ఆ తరహా వార్తలు కూడా రావడం లేదు. దీంతో ఆయన ఇటలీ వెళ్లారని.. కొందరు చెబుతున్నారు. కాదు.. రెస్టు తీసుకుంటున్నారని మరికొందరు చెబుతున్నారు. ఇదిలావుంటే... రాష్ట్రంలో స్థానిక సంస్థల కు చెందిన పదవుల విషయంలో ఇంత పెద్ద ఎత్తున రగడ చోటు చేసుకుంటే.. జనసేన తరఫున ఒక్కరంటే ఒక్కరు కూడా పదవులు తెచ్చుకోలేక పోయారు.
కూటమి పార్టీల తరఫున టీడీపీనే అంతా చూసుకుంది. పదవులు దాదాపుగా అన్నీ టీడీపీకే దక్కాయి. ఈ పరిణామాలతో అసలు జనసేనలో ఏం జరుగుతోందన్న చర్చ సహజం. స్థానిక సంస్థల్లో పోటీకి తమ వారి ని నిలబెట్టాలని తిరుపతిలో ప్రయత్నం చేశారు. కానీ, అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో నాయకులు సైలెంట్ అయ్యారు. మరోవైపు.. నామినేటెడ్ పదవులు పొందిన వారి విషయంలో అధికారులు తీసుకున్న నిర్ణయంపైనా జనసేన నాయకులు ఆగ్రహంతో ఉన్నారు.
ఇటీవల పలు నామినేటెడ్ పదవులను పంచిన విషయం తెలిసిందే. దీనిలో కొన్ని జనసేనకు కూడా దక్కాయి. అయితే.. ఆతర్వాత.. ఈ పదవులను ఏ-బీలుగా వర్గీకరించి.. వేతనాల విషయంలో భారీ వ్యత్యాసం చూపించారు. ఏ గ్రేడ్ నామినేటడ్ పదవులు పొందిన వారికి రూ.1.25 లక్షలు, బి-గ్రేడ్‌లో ఉన్న వారికి రూ.65 వేల వేతనం నిర్ణయించారు. బీ గ్రేడ్ పదవులు పొందిన వారిలో జనసేన నాయకులు ఉన్నారు. వీరంతా ఈ నిర్ణయంపై రగిలిపోతున్నారు. ఇలాంటి సమయంలో పవన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఎక్కడకి వెళ్లారన్న చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం.