బాబు తో పవన్ భేటీ... అంతా రొటీనేనా ?
టీడీపీ కూటమి ప్రభుత్వంలో కో ఆర్డినేషన్ లేదు అన్న ప్రచారం అయితే సాగుతోంది. ముఖ్యంగా వైసీపీ దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతోంది
By: Tupaki Desk | 7 Sep 2024 3:33 PM GMTటీడీపీ కూటమి ప్రభుత్వంలో కో ఆర్డినేషన్ లేదు అన్న ప్రచారం అయితే సాగుతోంది. ముఖ్యంగా వైసీపీ దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతోంది. సహాయం చేసే చోట కూడా మంత్రుల మధ్య వివిధ శాఖ మధ్య అవగాహన లేదని ఆ పార్టీ అంటోంది. అలా బాధితులను గాలికి వదిలేశారు అని విమర్శలు చేస్తోంది
ఇక వరదలు బెజవాడను ముంచెత్తిన తరువాత బాబు మంత్రుల పనితీరు మీద గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇపుడు చూస్తే ఆయన ఏకంగా జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ తోనే నేరుగా అనేక విషయాల మీద మాట్లాడారు, ముఖ్యంగా వరద సాయం సక్రమంగా అందకపోవడానికి కారణాలు అడిగారు.
అంతా కలసి పనిచేయాలని కూడా ఆయన సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. కట్ చేస్తే వినాయకచవితి వేళ విజయవాడ లోని కలెక్టరేట్ కి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. ఆయనకు వరద బాధితుల సహయం కోసం కోటి రూపాయల చెక్ ని కూడా పవన్ అందచేశారు.
ఈ సందర్భంగా పవన్ ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వాకబు చేసినట్లుగా తెలుస్తోంది. మీ ఆరోగ్యం ఎలా ఉంది అని బాబు అడిగి ఆయన గురించి తెలుసుకున్నారు అని అంటున్నారు. పవన్ అయితే వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించలేదు. ఆయన కనుక పర్యటిస్తే అక్కడ సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుంది అని అధికారులు సూచించారు అని పవన్ స్వయంగా చెప్పారు.
అయితే దీని మీద విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. పవన్ సహాయ చర్యలలో పాలు పంచుకుంటే బాగుండేది అన్న సలహాలూ వచ్చాయి. ఇదిలా ఉంటే పవన్ కి ఫీవర్ కూడా ఇటీవల వచ్చింది. దాంతో ఆయన గురించి బాబు ఇపుడు వాకబు చేశారు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే జనసేన మంత్రి నాదెండ్లతో బాబు వరద సాయం మీద మాట్లాడుతూ కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన మరుసటి రోజే పవన్ బాబుని కలవడం మీద మాత్రం కొంత ఆసక్తి అయితే ఏర్పడింది.
మరో వైపు వరద సాయం విషయంలో ఏర్పడిన ఇబ్బందుల నేపథ్యంలో జనసేన మీద ఆ నెపం నెట్టడానికి టీడీపీ చూస్తోంది అని వైసీపీ ఆరోపిస్తున్న నేపధ్యంలో ఈ భేటీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పాలి. అయితే ఏమి మాట్లాడుకున్నారు అన్నది తెలియకపోయినా బాబు పవన్ ల మధ్య మాత్రం మంచి అవగాహన ఉంది అన్నది అందరికీ తెలుసు అని అంటున్నారు.
చంద్రబాబు సైతం వరద బాధితుల సాయం మీదనే మాట్లాడారు తప్ప ఆయన ఎవరినీ పాయింట్ అవుట్ చేసి మాట్లాడలేదని కూడా అంటున్నారు. ఏది ఏమైనా అతి పెద్ద విపత్తు వచ్చింది. ప్రభుత్వం చేయాల్సిన సాయం చేస్తోంది. అయినా లోపాలూ లోటు పాట్లు అన్నీ ఉంటాయి. వాటిని అధిగమించమని చెప్పడం కూటమి పెద్దగా ముఖ్యమంత్రిగా బాబు బాధ్యత అని అంటున్నారు. మొత్తానికి వరదలు వచ్చిన తరువాత బాబు పవన్ భేటీ కావడం ఇదే ప్రధమం అని అంటున్నారు.
చంద్రబాబు అయితే గత వారం రోజులుగా విజయవాడలోనే ఉన్నారు. ఆయన సహాయ కార్యక్రమాలను వేగవంతం చేస్తూ బాధితులకు అండగా ఉంటున్నారు. అదే సమయంలో పవన్ శాఖాపరమైన కార్యక్రమాలను సమీక్షలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. మొత్తానికి కూటమిలో కో ఆర్డినేషన్ ఉందని చెప్పడానికి కూడా ఈ భేటీ జరిగిందా అన్న చర్చ కూడా సాగుతోందిట.