ఇప్పటికీ వెన్నునొప్పి.. అయినా ప్రజల కోసమే.. : డిప్యూటీ సీఎం పవన్
కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతుండటం వల్లే ఏపీలో కొన్ని ముఖ్య సమావేశాలకు వెళ్లలేకపోయానని తెలిపారు.
By: Tupaki Desk | 20 Feb 2025 12:16 PMఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణస్వీకారానికి వచ్చిన ఆయన మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతుండటం వల్లే ఏపీలో కొన్ని ముఖ్య సమావేశాలకు వెళ్లలేకపోయానని తెలిపారు. ఇప్పటికీ వెన్నునొప్పి తీవ్రంగా బాధిస్తోందని చెప్పారు.
ఢిల్లీలో పవన్ ప్రకటనతో పలు అనుమానాలకు ఫుల్ స్టాప్ పడింది. ఇటీవల ఏపీ క్యాబినెట్ సమావేశంతోపాటు మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. దీంతో రాజకీయ ప్రత్యర్థులు అనేక సందేహాలు లేవనెత్తుతూ డిప్యూటీ సీఎంపై ఊహాగానాలను ప్రచారంలోకి తెచ్చారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆ ఊహాగానాలపై ఇప్పటివరకు పెదవి విప్పలేదు. జ్వరం, స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్న ఆయన కోలుకున్న వెంటనే కేరళ, తమిళనాడుల్లోని కొన్ని హిందూ ఆలయాలను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ పర్యటన ముగించుకుని వచ్చాక సీఎం చంద్రబాబును కలిశారు. ఈ కలయికతో డిప్యూటీ సీఎంపై జరిగిన ప్రచారానికి చెక్ చెప్పినా, ప్రత్యర్థులు మాత్రం ఇంకా అనుమానాలు రేకెత్తిస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ వచ్చిన ఆయన మరోమారు ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. వెన్నునొప్పి కారణంగానే తాను ముఖ్య సమావేశాలకు హాజరుకాలేకపోయానని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో మూడు పార్టీల మధ్య మంచి సమన్వయం ఉందని చెప్పారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్నిమాజీ ముఖ్యమంత్రి జగన్ అప్పుల కుప్పగా మార్చేశారని ఆరోపించారు. జగన్ వల్ల రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు. అయినా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఇక పర్యావరణ, అటవీ శాఖలు తనకిష్టమైన శాఖలని డిప్యూటీ సీఎం తెలిపారు. నిబద్ధతతో తనకు కేటాయించిన శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నానని చెప్పారు.