అల్లు అర్జున్ అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్
అభిమానులకు అభివాదం చేయాలని ప్రతి హీరోకు ఉంటుందని అన్నారు.
By: Tupaki Desk | 30 Dec 2024 8:43 AM GMT'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన, హీరో అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు. మంగళగిరిలో మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారని కామెంట్ చేశారు. అభిమానులకు అభివాదం చేయాలని ప్రతి హీరోకు ఉంటుందని అన్నారు. ఈ విషయంలో హీరోను ఒంటరిని చేశారని, అలా అని పోలీసుల తీరును తప్పుబట్టలేమన్నారు. ఈ ఘటనలో మానవతా దృక్పథం లోపించినట్లైందని.. వెంటనే ఎవరో ఒకరు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఉంటే బాగుండేదని పవన్ అభిప్రాయపడ్డారు.
"తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిందిస్థాయి నుంచి ఎదిగిన గొప్ప నాయకుడు. వైసీపీ తరహాలో అక్కడ రేవంత్ వ్యవహరించలేదు. సినీ పరిశ్రమతో గౌరవంతో మర్యాదతో వ్యవహరించింది. బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోడానికి అవకాశం కల్పించింది. సీఎం సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయి. 'సలార్', 'పుష్ప 2' లాంటి సినిమాలకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. 'పుష్ప 2' మూవీకి సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరించారు. టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం కూడా సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించడమే అవుతుంది" అని పవన్ కళ్యాణ్ అన్నారు.
"అల్లు అర్జున్ విషయంలో ముందు, వెనుక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. కానీ చట్టం ముందు అందరూ సమానమే. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టను. భద్రత గురించే వారు ఆలోచిస్తారు. థియేటర్ యాజమాన్యం కూడా అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. సీట్లో కూర్చొన్నాక అయినా చెప్పి బయటకు తీసుకెళ్లాల్సింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం నన్ను కలచి వేసింది. అల్లు అర్జున్ కాకపోయినా, ఆయన తరఫున ఎవరో ఒకరు ముందే బాధిత కుటుంబాన్ని కలిసుంటే బాగుండేది"
"గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు. సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయి. బాధిత కుటుంబానికి అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది. తమ ప్రమేయం లేకుండా తప్పు జరిగి పోయిందని విచారం వ్యక్తం చేయాల్సింది. ఈ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది. అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది. పరామర్శించకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన అల్లు అర్జున్‌లో ఉంది. సినిమా అంటే టీమ్.. అందరి భాగస్వామ్యం. అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చడం కూడా కరెక్ట్ కాదు"
"సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అరెస్ట్ చేశారనడం సరికాదు. అల్లు అర్జున్ అనే కాదు, ఆ స్థానంలో ఎవరు ఉన్నా రేవంత్ అలానే చేసేవారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో రేవంత్ రెడ్డి పరిస్థితి రెండు వైపులా పదునున్న కత్తిలా మారిపోయింది. తొక్కిసలాట ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయి. అభిమానులు చెయ్యి ఊపాలని, అభివాదం చెయ్యాలని ప్రతీ హీరోకి ఉంటుంది. చిరంజీవి గతంలో అభిమానులతో కలిసి సినిమాలు చూడటానికి వెళ్లేవారు. కాకపోతే ఆయన ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్‌కు వెళ్లి వచ్చేవారు" అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.