డీఎంకే ని కెలుకుతున్న సేనాని
అన్నా డీఎంకే అధినాయకురాలు జయలలిత 2011 లో గెలిచి అయిదేళ్ళు సీఎం గా చేసిన తరువాత 2016లో మరోసారి గెలిచి తన తడాఖా చూపించారు.
By: Tupaki Desk | 5 Oct 2024 3:57 PM GMTతమిళనాడులో డీఎంకేకి 2026 ఎన్నికలు ఒక అగ్ని పరీక్షగానే చూడాలి. అయిదేళ్ల అధికారం తరువాత ప్రజా తీర్పు కోరడం అన్న మాట. తమిళనాడు వరసగా ఒక పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిన సందర్భం గత నాలుగు దశాబ్దాలలో ఒకసారి మాత్రమే జరిగింది. అది 2016లో మాత్రమే. అన్నా డీఎంకే అధినాయకురాలు జయలలిత 2011 లో గెలిచి అయిదేళ్ళు సీఎం గా చేసిన తరువాత 2016లో మరోసారి గెలిచి తన తడాఖా చూపించారు.
ఇక 2021లో అధికారంలోకి వచ్చిన డీఎంకే 2026లోనూ మరోసారి రావాలని చూస్తోంది. దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. సీఎం స్టాలిన్ తన కుమారుడిని భావి వారసుడిగా రెడీ చేసి పెడుతున్నారు. ఉదయనిధి స్టాలిన్ ని డిప్యూటీ సీఎం చేయడం అందులో భాగమే.
ఇదిలా ఉంటే ఉదయనిధి మీద తిరుపతి వారాహి సభలో సీరియస్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా మరోమారు కెలికారు. ఆయన ఈసారి డైరెక్ట్ గా డీఎంకేని ఏమీ అనలేదు. ఆయన అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎంజీఆర్ ని పొగిడారు.
ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ తమిళనాడు రాజకీయాల్లో గట్టిగానే పనిచేసేలా ఉంది. ఇంతకీ ఆయన ఆ ట్వీట్ లో ఏమన్నారు అంటే ఈ నెల 17తో అన్నా డీఎంకే ఏర్పాటు అయి 53 ఏళ్ళు నిండుతున్నాయి ఈ సందర్భంగా ఎంజీఆర్ ని ప్రశంసిస్తూ ఆయన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు ఎంజీయార్ ని గ్రేట్ అని కీర్తించారు. తనకు చిన్ననాటి నుంచే ఎంజీఆర్ గురించి పాఠశాలలో తెలిసిందని అలా ఆయన పట్ల ప్రేమతో పాటు నిండైన అభిమానం ఏర్పడింది అని అన్నారు.
ఎంజీఆర్ పరోపకారం, దయాగుణం, నిష్కపటత్వం, తన ప్రజల పట్ల శ్రద్ధ కలిగిన మహా నాయకుడు అన్నారు. ఆయన తన రాజకీయ జీవితంలో రాజులా వెలిగారు అని కూడా పవన్ అన్నారు. ఇలా ఎంజీఆర్ ని సడెన్ గా పవన్ పొగడడం పట్ల చర్చ సాగుతోంది. ఆయన ఇటీవల డీఎంకే మీద విమర్శలు చేసిన నేపధ్యంలో డీఎంకే నుంచి కౌంటర్లు స్టార్ట్ అయ్యాయి. దాంతో ఆయన ఎంజీఆర్ ని పొగడడం ద్వారా అన్నా డీఎంకేకు చేరువ అయ్యేందుకు చూస్తున్నారు అని అంటున్నారు.
పవన్ కి తమిళనాడులో కూడా అభిమానులు ఉన్నారు. ఇక అన్నా డీఎంకేకు కూడా సరైన బూస్టింగ్ అవసరం. ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ ఎంజీఆర్ ని పొగడడం ద్వారా అన్నా డీఎంకేకు ఊతమిచ్చారు అని అంటున్నారు.
తనను తమిళనాడులో డీఎంకే ట్రోల్స్ చేస్తూండడంతోనే పవన్ ఈ కొత్త స్ట్రాటజీని ఎంచుకున్నారు అని అంటున్నారు. పవన్ పాత వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసూ డీఎంకే క్యాడర్ గట్టిగా కౌంటర్లు ఇస్తోంది. అంతే కాదు మెగాస్టార్ చిరంజీవిని కూడా ఈ ఇష్యూలోకి లాగుతోంది. మీ సోదరుడిని భావోద్వేగాలు ఆవేశాలు తగ్గించుకోమని చెప్పండి అంటూ ట్యాగ్ చేస్తోంది.
గత రెండు మూడు రోజులుగా ఇది ఒక పెద్ద దుమారంగా సాగుతోంది. ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్న సూత్రాన్ని ఇపుడు పవన్ వాడుతున్నారు అని అంటున్నారు. అందుకే ఆయన అన్నాడీఎంకేని పైకి లేపేలా ఎంజీఆర్ ని తెర మీదకు తెచ్చారని అంటున్నారు. దీంతో ఇపుడు జనసేనకు అన్నా డీఎంకే మద్దతు కూడా దొరుకుతుందని భావిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి పవన్ తమిళ రాజకీయం చాలా ఆసక్తిని రేపుతోంది. ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాల్సి ఉంది.