Begin typing your search above and press return to search.

'పవన్ అప్పటికి పుట్టి ఉండరు'... డీఎంకే నుంచి స్ట్రాంగ్ రియాక్షన్!

ఈ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా స్టాలిన్ సర్కార్ ముందుకు కదులుతుంది.

By:  Tupaki Desk   |   15 March 2025 3:39 PM IST
పవన్  అప్పటికి పుట్టి ఉండరు... డీఎంకే నుంచి స్ట్రాంగ్  రియాక్షన్!
X

త్రిభాషా సూత్రం అమలు విషయంలో అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా స్టాలిన్ సర్కార్ ముందుకు కదులుతుంది. ఈ క్రమంలో రాష్ట్ర బడ్జెట్ లో రూపాయి సింబల్ ను తొలగించి.. ఆ స్థానంలో "రూ" అనే అర్ధం వచ్చేలా తమిళ అక్షరాన్ని చేర్చింది.

ఈ విధంగా... హిందీ భాషను తమపై రుద్దే విషయంపై రియాక్ట్ అవ్వడానికి ఏమాత్రం తగ్గేదేలే అనే సంకేతాలు ఇస్తోంది! ఈ సమయంలో తాజాగా పవన్ కల్యాణ్ స్పందించారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారన్నప్పుడు.. తమిళ సినిమాల్ని హిందీలో ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ సమయంలో డీఎంకే నుంచి పవన్ కు రిప్లై వచ్చేసింది.

అవును... త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయని అంటున్నారు. ఈ సమయంలో డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయీద్ హఫీజుల్లా స్పందించారు. పవన్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు.

తమిళనాడు వైఖరిని పవన్ కల్యాణ్ తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని తాము ఎన్నడూ అడ్డుకోలేదని.. ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవడం కోసం ఇప్పటికే తమ రాష్ట్రంలో హిందీ ప్రచార సభలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే.. కేంద్రం మాత్రం తమ ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దుతోందని అన్నారు.

దీనికోసం... కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (ఎన్.ఈ.పీ), ప్రధానమంత్రి శ్రీస్కూల్ వంటి విధానాలతో తమ రాష్ట్ర ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందని.. దీనికి తాము పూర్తిగా వ్యతిరేకమని వెల్లడించారు. ఈ విషయం పవన్ కు అర్ధం కావడం లేదని తెలిపారు!

ఇదే సమయంలో... పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే కు చెందిన మరో సీనియర్ నేత ఏఈకేఎస్ ఎళన్ గోవన్ మాట్లాడుతూ... 1938 నుంచే తమిళులపై హిందీ భాష బలవంతంగా రుద్ధడాన్ని వ్యతిరేకిస్తున్నామని.. ద్విభాషా విధానాన్నే అమలుచేస్తామని ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించుకున్నామని తెలిపారు.

విద్యా నిపుణుల సలహాలు, సూచనల మేరకే ఈ ద్విభాషా విధానానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నామని.. దీనికి సంబంధించిన బిల్లు 1968లోనే పాస్ అయ్యిందని.. బహుశా అప్పటికి పవన్ కల్యాణ్ పుట్టి ఉండరని.. ఆయనకు తమిళ రాజకీయాలపై అవగాహన లేకపోయి ఉండొచ్చని విమర్శించారు.

కాగా... కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ "జయకేతనం"లో ప్రసంగించిన పవన్... దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ తమిళులు మాట్లాడుతున్నారు.. అలాంటప్పుడు తమిళ సినిమాల్ని హిందీలో డబ్బింగ్ చేయొద్దు.. మీకు డబ్బులేమో యూపీ, బీహార్ నుంచి కావాలా? హిందీ మాత్రం వద్దా? అని ప్రశ్నించారు.

ఇదే సమయంలో.. రూపాయి సింబల్ మార్చేసి తమిళ భాషలో పెట్టుకోవడం ఏమిటి? వివేకం, ఆలోచన ఉండోద్దా? అంటూ నిలదీశారు. దీంతో... ఈ వ్యాఖ్యలపై డీఎంకే నేతలు పై విధంగా స్పందించారు. పవన్ కు తమిళరాజకీయాలపై అవగాహన లేకపోయి ఉండొచ్చంటూ ఎద్దేవా చేస్తూ, విమర్శిస్తున్నారు!