పవన్ స్పెషాలిటీ అంటే అదే !
కానీ ఆయన పేదల పట్ల అభాగ్యుల పట్ల ఎంతో మానవత్వంతో స్పందిస్తారు.
By: Tupaki Desk | 16 Feb 2025 3:56 AMపవన్ కల్యాణ్ మనసు మంచిదని మరో మారు నిరూపించుకున్నారు. ఆయన పేదల కోసం తపిస్తారు. తన సంపద నుంచి ఆయన ఎంతో ఆపన్నుల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. పవన్ టాలీవుడ్ లో టాప్ రేంజ్ హీరో. ఆయన ఎంతో సంపాదించుకోవచ్చు. దానికి పదింతలుగా చేసి కూడబెట్టుకోవచ్చు. కానీ ఆయన పేదల పట్ల అభాగ్యుల పట్ల ఎంతో మానవత్వంతో స్పందిస్తారు.
అందుకే ఆయన ఎంతో భవిష్యత్తు ఉన్న సినీ రంగాన్ని వదులుకుని మరీ రాజకీయాల్లోకి వచ్చారు. ఇదిలా ఉంటే విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితులకు ఆర్ధిక సహాయం కోసం జరిగిన కార్యక్రమంలో పవన్ పాల్గొని తన వంతుగా యాభై లక్షల రూపాయలను ఎన్టీఆర్ ట్రస్ట్ కి విరాళంగా అందచేశారు.
దీంతో నిజంగా పవన్ గ్రేట్ అని అంతా కొనియాడుతున్నారు. అది కూడా తన దగ్గర ఉన్న డబ్బు ఇటీవల చాలా ఖర్చు అయిపోయిందని అందువల్ల ఉన్న దాంట్లో నుంచే ఈ మొత్తం ఇస్తున్నాను అని చెప్పి పవన్ యాభై లక్షలు ఇచ్చారు అంటే నిజంగా ఆయన మనసు ఎంత గొప్పది అన్నది అందరికీ అర్థం అవుతోంది. పవన్ కి నిజంగా ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉండి ఉంటే ఈ మొత్తానికి మరిన్ని రెట్లు ఇచ్చి ఉండేవారు అని కూడా అంటున్నారు
ఇక పవన్ ఎన్టీఅర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయిన నారా భువనేశ్వరిని కొనియాడారు. ఆమె ఎంతో దృఢ దీక్ష కలిగిన మహిళ అన్నారు. చంద్రబాబు సైతం ఆపన్నుల కోసం చేసే కార్యక్రమాలలో ఎపుడూ ముందుంటారు అని అన్నారు. అందుకే తాను ఈ కార్యక్రమానికి ఒట్టి చేతితో రావడం ఇష్టం లేకనే తన వంతుగా ఆర్ధిక సాయం చేశాను అని చెప్పారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ తన దాతృత్వాన్ని మరో మారు నిరూపించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన వారు కానీ సినీ రంగంలో ఉన్న వారు కానీ అలవోకగా విరాళాలు ప్రకటించేది అయితే తక్కువగా ఉంటుంది. చాలా మంది మంచి మనసులో విరాళాలు ఇచ్చినా అది ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇస్తారు. కానీ పవన్ తీరు వేరుగా ఉంటుంది. ఆయన అవసరం అనుకున్నది అయితే మాత్రం సొంత డబ్బులను ఖర్చు చేస్తూంటారు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్ చేపట్టిన ఈ మంచి కార్యక్రమానికి పవన్ ఆర్ధిక సాయంతో మరింత నిండుతనం వచ్చింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే పవన్ రాకతో చంద్రబాబు ముఖం వెలిగిపోయింది. ఆయన పవన్ భుజం మీద చేయి వేసి మరీ ఆప్యాయంగా పలకరించారు. ఆయనతో ముచ్చట్లు పెడుతూ ఆ కార్యక్రమం ఆద్యంతం ఎంతో సందడి చేశారు అలాగే లోకేష్ తన కుమారుడు దేవాన్ష్ ని పరిచయం చేశారు. ఆ తరువాత ఒకే టేబిల్ వద్ద పవన్ చంద్రబాబు బాలకృష్ణ, లోకేష్ కలసి నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడం అందరినీ ఆకట్టుకుంది అనే చెప్పాలి.