పవన్ అలా ఇచ్చి పడేశారుగా !
పవన్ సైతం వచ్చిన జనాలను ఏ మాత్రం నిరాశ పరచకుండా సుదీర్ఘమైన స్పీచ్ నే ఇచ్చారు.
By: Tupaki Desk | 5 Jan 2025 3:34 AM GMTగేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రాజమండ్రిలో జరిగింది. ఈ ఫంక్షన్ లో అతి పెద్ద ఎట్రాక్షన్ పవన్ కళ్యాణ్. ఆయన జనసేన అధినేత, ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి. అన్నింటికీ మించి వెండి తెర మీద పవర్ స్టార్. దాంతో ఆయన స్పీచ్ కోసం అంతా ఉర్రూతలూగారు. పవన్ సైతం వచ్చిన జనాలను ఏ మాత్రం నిరాశ పరచకుండా సుదీర్ఘమైన స్పీచ్ నే ఇచ్చారు.
ఈ స్పీచ్ లో పవన్ చాలా మందికి వడ్డీతో సహా ఇచ్చి పడేశారుగా అన్న చర్చ అయితే ఉంది. ఆయన ఎవరి పేరూ ప్రస్తావించలేదు, కానీ ఆయన ఇండైరెక్ట్ గా వేసిన పంచులు ఎవరికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలాయని అంటున్నారు. పాలకులు హీరోలను రప్పించుకోవడమేంటి వారితో వంగి వంగి నమస్కారాలు చేయించుకోవడమేంటి అంటూ పవన్ తన స్పీచ్ లో లేవనెత్తిన ప్రశ్నలు ఎవరిని ఉద్దేశించి అన్నది అందరికీ తెలిసిందే.
ఇక టికెట్ల రేట్లు పెంచుకునే విషయంలోనూ పవన్ తన అభిప్రాయాన్ని మరోమారు కుండబద్ధలు కొట్టారు. సినిమా అన్నది ఒక బిజినెస్. డిమాండ్ అండ్ సప్లై. తొలి రోజున తన అభిమాన హీరో మూవీ చూడాలని అనుకుని ఆ డిమాండ్ ఉన్న వారే చూస్తారు. అలా సినిమాకు ఉన్న హైప్ కి డిమాండ్ కి టికెట్ రేటు పెంపు సరైన జస్టిఫికేషన్ అని పవన్ అన్నారు.
ఈ రోజున తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైంది. అందువల్ల బడ్జెట్ పెరిగిపోతోంది. మరి దానికి తగినట్లుగా డిమాండ్ ఉన్నపుడు టికెట్లు రేట్లు పెంచడంలో తప్పేముంది అన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఇక సినిమా రేట్లు పెంచడం పట్ల జనాలలో నెగిటివ్ గా నేరేషన్ వెళ్తోందని ఆయన అంటూ నిజానికి ప్రతీ రూపాయికి 18 పైసలు జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అని చెబుతూ ఇది ఖజానాకు లాభమే అని అన్నారు.
టికెట్లు రేట్లు పెంచకపోతే బ్లాక్ లో అమ్ముతారని అది ఎవరి జేబుల్లోకి పోతుందని ఆయన అన్నారు. ఆ విధంగా టికెట్ రేట్లు పెంచమని అన్న పాలకులకు ఆయన చెప్పాల్సింది సినీ పరిశ్రమ తరఫున చెప్పేశారు అని అంటున్నారు.
ఇక ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని ఆయన చెబుతూ తాను చరణ్ చిరంజీవి వల్లనే ఈ స్థితిలో ఉన్నామని అన్నారు. మూలాలు ఎవరూ మరచిపోరాదు అన్న ఆయన మాటలు కూడా ఎవరికి తోచిన తీరున వారు అర్ధం చేసుకోవచ్చు అని కూడా అంటున్నారు.
అంతే కాదు సినిమా అన్నది బలమైన మధ్యమమని వినోదంతో పాటు సందేశం కూడా ఉండాలని ఆయన చెప్పారు. ఆ విధంగా హీరోలు డైరెక్టర్లు నిర్మాతలు అందరూ బాధ్యత తీసుకోవాలని చెబుతూ తన ఖుషీ సినిమాలో తాను ఒక సందేశాత్మకమైన పాటలో ఎలా దర్శకుడిని డిమాండ్ చేసి మరీ నటించినది ఆయన గుర్తు చేసుకున్నారు. ఇది కూడా నెగిటివ్ షేడ్ తో ఉన్న హీరో పాత్రలు పోషిస్తున్న వారు ఆలోచించాల్సిందే అని అంటున్నారు.
సినీ పరిశ్రమ సొంత ఆలోచనలు చేయాలని భారతీయ మూలాల నుంచి కధలు పుట్టాలని ఆయన చెప్పారు. హాలీవుడ్ ని అనుకరించడం మానుకోవాలని కోరారు. అదే సమయంలో తెలుసు సినీ పరిశ్రమ ఏపీలోనూ అభివృద్ధి చెందాలని ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో సినీ పరిశ్రమను కోరారు.
ఏపీలో ఉన్న ఎన్నో అందాలను సెల్యూలాయిడ్ మీద బంధించవచ్చునని అన్నారు. అలాగే ఏపీ యువతకు ఇరవై నాలుగు క్రాఫ్టుల మీద శిక్షణను ఇచ్చేలా ట్రైనింగ్ సెంటర్లు పెట్టాలని కూడా కోరారు. మొత్తం మీద ఆయన తన స్పీచ్ లో ఎన్నో అంశాలను ప్రస్తావించారు. ఎవరి పేరూ ఎత్తలేదు, కానీ ఏది ఎవరికి తగలాలో వారికి తగిలేలా ఆయన స్పీచ్ అదరగొట్టారని కూడా అంతా చెప్పుకొచ్చారు. మొత్తానికి గేమ్ చేంజర్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన పవన్ తన స్పీచ్ తో గేమ్ చేంజ్ చేసేలాగానే మాట్లాడారని అంటున్నారు.