ఢిల్లీకి పవన్....కూటమి మీద కంప్లైంట్ ?
అందుతున్న సమాచారం బట్టి చూస్తే ఇది సడెన్ గా పెట్టుకున్న టూర్ అని అంటున్నారు.
By: Tupaki Desk | 5 Nov 2024 5:56 PM GMTటీడీపీ కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన పాత్రను పోషిస్తున్న జనసేన అధినేత కె పవన్ కళ్యాణ్ సడెన్ గా ఢిల్లీకి ప్రయాణం కట్టారు. పవన్ బుధవారం సాయంత్రం ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. అందుతున్న సమాచారం బట్టి చూస్తే ఇది సడెన్ గా పెట్టుకున్న టూర్ అని అంటున్నారు. పవన్ షెడ్యూల్ లో లేని ఈ టూర్ ని అంత అర్జెంట్ గా ఎందుకు పెట్టుకున్నారు అన్నది కనుక చూస్తే ఆయన ఢిల్లీ వెళ్తున్నది చాలా పెద్ద పని మీదనే అని అంటున్నారు.
తాజాగా పవన్ పిఠాపురం సభలో మాట్లాడుతూ హోం మంత్రి అనిత శాఖ మీద కీలక వ్యాఖ్యలే చేశారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని అన్నట్లుగా ఆయన తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. అంతే కాదు ఆయన ఏపీలో హోం శాఖ పనితీరు ని సైతం ప్రశ్నించారు. హోంమంత్రి అనిత తన శాఖ మీద రివ్యూ నిర్వహించాలని కూడా సలహా ఇచ్చారు.
అవసరం అయితే హోం శాఖను తానే తీసుకుంటాను అని కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఇక అది జరిగిన ఇరవై నాలుగు గంటలలోగా అనేక పరిణామాలు చకచకా జరిగిపోయాయి. హైదరబాద్ నుంచి వచ్చిన మాదిగ దండోరా నాయకుడు మంద క్రిష్ణ మాదిగ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలసి పవన్ వ్యాఖ్యల మీద ఫిర్యాదు చేశారు అని కూడా ప్రచారం సాగింది.
ఇక అనంతరం మీడియాతో మాట్లాడిన మంద క్రిష్ణ మాదిగ కాపులకే పవన్ పెద్దన్న తప్ప తమకు కాదని అన్నారు. రిజర్వేషన్ సీట్లు తప్ప ఎస్సీలకు పవన్ వేరేగా ఇచ్చిన సీట్లు లేవని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు దారుణం అని అన్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన అనిత మీద పవన్ చేసిన విమర్శలను తప్పు పట్టారు.
పవన్ శాఖను మరో మంత్రి తీసుకుంటాను అంటే ఆయన ఊరుకుంటారా అని కూడా ప్రశ్నించారు. ఇవన్నీ చూసినపుడు ఏదో తెర వెనక చాలానే జరుగుతోంధి అని అంటున్నారు. ఈ నేపథ్యంలో సడెన్ గా పవన్ ఢిల్లీ టూర్ పెట్టుకోవడం పైగా కేంద్ర హోం మంత్రి బీజేపీ పెద్ద దిక్కు కేంద్ర ప్రభుత్వంలో బిగ్ షాట్ అయిన అమిత్ షా తో భేటీ అంటే చాలా పెద్ద విషయమే అని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను అన్నీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించడానికే పవన్ ఈ టూర్ పెట్టుకున్నారు అని అంటున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ మీద కూడా ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చే వీలు ఉందని అంటున్నారు.
బీజేపీకి అతి నమ్మకమైన నేస్తంగా మారిన జనసేన అధినేత ఇపుడు ఢిల్లీ టూర్ పెట్టుకోవడం పట్ల రాజకీయ వర్గాలలో అయితే వాడిగా వేడిగా చర్చ సాగుతోంది. పవన్ ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత మొదటి సారి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన కేంద్ర హోం మంత్రిని కూడా ఈ హోదాలో కలుసుకుంటున్నారు.
మరి ఆయన ఏపీలో కూటమి ప్రభుత్వం మీద తనకు ఉన్న ఫిర్యాదులు చెబుతారా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఏపీలో కూటమిలో ఏదో జరుగుతోంది అన్నది అయితే ప్రచారంగా ఉంది. మరి పవన్ టూర్ దేనికి ఆయన ఎందుకు అమిత్ షాతో భేటీ వేస్తున్నారు అన్నది కూడా చర్చించుకుంటున్నారు. అయితే ఏపీకి నిధుల కోసం చర్చించేందుకే పవన్ వెళ్తున్నారు అని జనసేన వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో.