Begin typing your search above and press return to search.

గుడివాడ నీటి కాలుష్యానికి చెక్‌.. 'ఫిల్ట‌ర్ బెడ్ వాట‌ర్‌'కు ప‌వ‌న్ ఓకే!

కృష్ణాజిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలోని శివారు గ్రామాలు తాగునీటి కాలుష్యంతో అల్లాడుతున్నాయి.

By:  Tupaki Desk   |   19 Nov 2024 10:30 PM GMT
గుడివాడ నీటి కాలుష్యానికి చెక్‌.. ఫిల్ట‌ర్ బెడ్ వాట‌ర్‌కు ప‌వ‌న్ ఓకే!
X

కృష్ణాజిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలోని శివారు గ్రామాలు తాగునీటి కాలుష్యంతో అల్లాడుతున్నాయి. కొన్ని ద‌శాబ్దాలుగా ఈ స‌మస్య తాండ‌విస్తోంది. తాగునీరు కలుషితం కావ‌డంతో ఇక్క‌డి ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. గ‌తంలో ఎమ్మెల్యే, క‌మ్ మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రించిన కొడాలి నానీకి అనేక సంద‌ర్భాల్లో విన్న‌వించారు. ఆయా గ్రామాల‌ను ప‌లు సంద‌ర్భాల్లో నానీ కూడా ప‌రిశీలించారు. నీరు క‌లుషితం అవుతోంద‌ని గుర్తించారు. కానీ, దీనికి సంబంధించి ఎలాంటి చ‌ర్య‌లూ ఆయ‌న తీసుకోలేదు.

అయితే.. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన ఎన్నారై నాయ‌కుడు వెనిగండ్ల రాము.. ఎన్నిక‌ల‌కు ముందు పాద‌యాత్ర చేశారు. ఈ స‌మ‌యంలో ప‌లు గ్రామాల ప్ర‌జ‌లు తాగు నీటి స‌మ‌స్య‌, నీటి కాలుష్యాన్ని ఆయ‌న‌కు ఏక‌రువు పెట్టారు. ఆయా స‌మ‌స్య‌ల‌ను క‌ళ్లారా చూసిన రాము.. తాను గెలిచిన త‌ర్వాత త‌ప్ప‌కుండా తాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. అన్న‌ట్టుగానే ఆయ‌న గెలిచిన త‌ర్వాత‌.. తాగునీటి క‌లుషిత స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేశారు. రెండునెల‌ల కింద‌ట పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఉన్న ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిసి స‌మ‌స్య‌ను విన్న‌వించారు.

దీనిపై అధ్య‌య‌నం కూడా చేయించిన ప‌వ‌న్‌.. ఫిల్ట‌ర్ బెడ్ ద్వారా నీటిని శుద్ధి చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుసుకుని ప్ర‌యోగాత్మ కంగా ఈ ప్ర‌క్రియ‌కు అనుమ‌తి ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో గ‌త నెల‌లోనే ఫిల్ట‌ర్ బెడ్ ఏర్పాటుకు.. శ్రీకారం చుట్టారు. తొలుత ప్ర‌యోగాత్మ‌కంగా తాగునీటి స‌మ‌స్య ఉన్న ప్రాంతాల్లోని గుడివాడ మండలం వలివర్తిపాడు లో నూతన ఫిల్టర్ బెడ్ ల‌ను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఫిల్టర్ అయిన నీటిని ప‌రిశీలించి.. స్వ‌చ్ఛంగా ఉన్న‌ట్టు గుర్తించారు.

తాజాగా ఈ నీటిని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు చూపించారు. శుద్ధి చేయ‌డానికి ముందు.. త‌ర్వాత‌.. నీటిని స్వ‌యంగా ప‌రిశీలించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సంతృప్తి వ్య‌క్తం చేశారు. త్వ‌ర‌లోనే ఆయా గ్రామాల్లో ఫిల్టర్ బెడ్ ల‌ను ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది. ప్రాథ‌మిక అంచ‌నా ప్ర‌కారం.. రెండు నెల‌ల కింద‌టే ఒక్కొక్క గ్రామానికీ.. 20 కోట్ల రూపాయ‌లు చొప్పున ఖ‌ర్చ‌వుతాయ‌ని అధికారులు పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఫిల్ట‌ర్ బెడ్‌ల‌ను ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది.