అందరిలో ఆయనే సనాతని !
ఆ తర్వాత కూడా ఆయన తరచూ ప్రపంచ వామపక్ష నేతలను కొనియాడుతూ వచ్చారు.
By: Tupaki Desk | 21 Feb 2025 2:30 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినపుడు ఆయన ఎక్కువగా వామపక్ష భావజాలాన్ని ప్రవచించారు. ఆయన హైదరాబాద్ లో ఇచ్చిన తొలి స్పీచ్ లో ఎక్కువగా అభ్యుదయ వాదాన్ని వినిపించారు. ఆ తర్వాత కూడా ఆయన తరచూ ప్రపంచ వామపక్ష నేతలను కొనియాడుతూ వచ్చారు. అయితే 2014 ఎన్నికల వేళ పవన్ బీజేపీకి టీడీపీకి మద్దతు ఇచ్చారు.
ఆ తరువాత మూడేళ్ళకు బీజేపీ నుంచి విడిపోయినపుడు వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు. మాయావతితోనూ స్నేహం కలిపారు. ఆ విధంగా 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఫలితం తేడా కొట్టగానే మళ్ళీ బీజేపీతో పొత్తుకు సిద్ధపడ్డారు. ఇలా కేవలం తొలి అయిదేళ్ళ కాలంలోనే ఆయన రైటిస్ట్ లెఫ్టిస్టు భావజాలాల మధ్య తన పార్టీని తిప్పారు అన్న ప్రచారం ఉంది.
ఇక 2020 జనవరిలో బీజేపీతో మళ్ళీ పొత్తు పెట్టుకున్నా ఈ రోజు వరకూ దానిని కొనసాగిస్తున్నారు. ఇక చూస్తే 2024 ఎన్నికల తరువాత బీజేపీ భావజాలాన్ని పూర్తిగా తనలో ఆవహింప చేసుకుని పవన్ మరింతగా ముందుకు వెళ్తున్నారు అన్న చర్చ సాగుతోంది. ఆయన బీజేపీ వారి కంటే కూడా ఎక్కువగా హిందూత్వ విషయంలో స్పందిస్తున్నారు తిరుపతి లడ్డు ఇష్యూలో ఆయనే చాలా ప్రకటనలు చేశారు.
పది రోజుల పాటు దీక్షలు చేశారు వారాహి సభ పెట్టి మరీ దేశంలో బీజేపీ సహా ఏ రాజకీయ పార్టీ కోరని విధంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆ విధంగా జాతీయ స్థాయిలో పవన్ ఆకర్షించబడ్డారు. ఇక పవన్ ఇటీవల మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలకు వెళ్ళినపుడు మీడియాతో మాట్లాడుతూ హిందూత్వ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసారు. మమతా బెనర్జీ వంటి వారు మృత్యు కుంభ్ అంటూ చేసిన కామెంట్స్ ని తిప్పికొట్టారు.
ఇక ఢిల్లీలో చూస్తే అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వేదిక మీద నుదుటిన పొడవాటి నామంతో సనాతన దుస్తులతో పవన్ ప్రత్యేకంగా కనిపించారు. ఆయనకు అటూ ఇటూ కూర్చున్న బీజేపీ నేతలు ఎవరూ కూడా సనాతన వస్త్రధారణతో కనిపించలేదు. ఆ విధంగా కాషాయం నేతల కంటే మిన్నగా పవన్ కనిపించారు.
బహుశా దీనిని చూసిన మీదటనే ప్రధాని నరేంద్ర మోడీ పవన్ ని చూసి హిమాలయాలకు వెళ్తావా అని జోక్ చేశారు అని అంటున్నారు. బీజేపీ హిందూత్వ గురించి డెబ్బై ఏళ్ళుగా పోరాడుతోంది. ఇక ఆరెస్సెస్ వందల ఏళ్ళుగా హిందూత్వ భావ జాలాన్ని జనాల్లోకి తీసుకెళ్తోంది. అయితే వారిలో ఎవరూ సనాతనిగా కనిపించేందుకు ప్రయత్నాలు కనీసంగా చేయరని అంటున్నారు. వారిది అంతా ఆచరణే అని చెబుతారు.
హిందూత్వ విషయంలో బీజేపీకి ఉన్న సంకల్పం కానీ పట్టు కానీ ఎవరికీ లేవని గట్టిగా చెప్పవచ్చు. అయితే బీజేపీ తర్వాత ఆ స్థాయిలో హిందూత్వ మీద గర్జించిన పార్టీ శివసేన. ఇపుడు ఆ పార్టీ కూడా ఇండియా కూటమిలో చేరింది. దాంతో జనసేన దేశంలోనే ఏకైక పార్టీగా ఈ విషయంలో ఉంది అని అంటున్నారు.
పవన్ సనాతన ధర్మం పట్ల అనురక్తిని పెంచుకుని దేశంలో బలంగా ఉండాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో ఆయన నిబద్ధత కూడా ఎవరూ శంకించాల్సిన అవసరం లేదు. కానీ గతంలో ఆయన లెఫ్టిస్టు భావజాలానికి ఎందుకు ఆకర్షించబడ్డారు, ఇపుడు ఎందుకు సనాతనిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు అన్న దాని మీద అయితే చర్చ సాగుతూనే ఉంది. అభిప్రాయాలను మార్చుకోవడంలో తప్పు అయితే లేదు. ఈ దేశంలో అత్యధిక శాతం హిందువులు ఉన్నారు. వారి కోసం మాట్లాడేందుకు పార్టీలు అయితే పెద్దగా లేవు ఇపుడు బీజేపీ తరువాత జనసేన ఉంది.
బీజేపీకి రాజకీయాలతో కంటే గెలుపు ఓటముల కంటే కూడా హిందూత్వ సిద్ధాంతం మీద సంపూర్ణమైన సంకల్పం ఉంది. జనసేన కూడా అదే బాటన నడిస్తే మాత్రం దేశంలో రైటిస్ట్ ఫిలాసఫీ మరింతగా బలపడుతుంది. మరి పవన్ సనాతనీగా ఈ దేశం కోసం ఎంతదాకా ఎంత బలంగా ముందుకు వెళ్తారన్నది మాత్రం అంతా ఆసక్తిగా చూస్తున్నారు.