Begin typing your search above and press return to search.

ఏటికొప్పాకను గొప్పగా నిలబెట్టిన పవన్

ఆ విధంగా చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాలకే తలమానికంగా ఉన్న ఏటికొప్పాక కళా కృతులను చూసి పవన్ ముచ్చట పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

By:  Tupaki Desk   |   4 March 2025 12:00 AM IST
ఏటికొప్పాకను గొప్పగా నిలబెట్టిన పవన్
X

జన్సేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన శాఖకు సంబంధించిన నిర్ణయాలను ఎంత సమగ్రమైన ఆలోచనలు చేసి తీసుకుంటారో ఇపుడిపుడే అందరికీ తెలిసి వస్తున్నాయి. స్వతహాగా మన ప్రాంతం మన కళాకారులు మన కళా కృతుల పట్ల పవన్ కి ఉన్న మక్కువ చాలా ఎక్కువ. ఆ విధంగా చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాలకే తలమానికంగా ఉన్న ఏటికొప్పాక కళా కృతులను చూసి పవన్ ముచ్చట పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఆయన స్వయంగా వాటిని కొనుగోలు చేసి వాటి విశిష్టతను చాటి చెప్పారు. ఇపుడు ఉప ముఖ్యమంత్రిగా వాటికి ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసే విషయంలో పవన్ చేస్తున్న కృషి నిరుపమానమైనదిగా అంతా చూస్తున్నారు. ఏటికొప్పాక కళా కృతులు ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల పరేడ్ లో నిలిచి అందరి దృష్టిని ఎంతగా ఆకర్షించాయో తెలిసిన విషయమే. పైగా మూడవ బహుమతి కూడా సొంతం చేసుకుని ఇవి ఏపీకి అరుదైన ఘనతను తెచ్చిపెట్టాయి.

ఇలా గణతంత్ర వేడులక పరేడ్ లో ఈ కళాకృతులు పాల్గొనడం వెనక పవన్ మార్క్ కృషి ఉందన్నది తెలిసిందే. మరో వైపు చూస్తే ఏటికొప్పాక బొమ్మలను బహు గొప్పగా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతూ పవన్ చేసిన ఈ ప్రయత్నం సర్వత్రా ప్రశంసంలు అందుకుంటోంది. ఏకంగా రాష్ట్రపతి నివాసం ఉండే అధికార భవనం రాష్ట్రపతిభవన్ లో ఏటికొప్పాక బొమ్మల స్టాల్ ని లేటెస్ట్ గా ఏర్పాటు చేశారు. దీని వెనక కూటమి ప్రభుత్వం అలాగే పవన్ కృషి ఎంతో ఉంది.

అలా రాష్ట్రపతిభవన్ లో ఏటికొప్పాక బొమ్మల స్టాల్ ని ఏర్పాటు చేసేందుకు శరత్ అనే కళాకారుడికి అరుదైన అవకాశం దక్కింది. దాంతో రాష్ట్రపతి భవన్ లో ఏటికొప్పాల బొమ్మలు ప్రతి నిత్యం సందడి చేయనున్నాయి. అంతే కాదు దేశ విదేశాల నుంచి నిత్యం వచ్చీ పోయే వారి కోసం ఈ స్టాల్స్ ఉన్నాయి. వీటిని ఇక మీదట మరింతమంది వీక్షించి అభిమానులు అవుతారు. అలా మరింతగా ప్రాచుర్యం పొందే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే ఏటికొప్పాక కళాకృతులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అది తాజా నిర్ణయంతో ద్విగిణీకృతం అవుతుంది అని అంటున్నారు. అదే విధంగా చూస్తే కనుక ఏటికొప్పాక బొమ్మలు సహజసిద్ధమైనవి. ఎలాంటి రసాయనాకు వాడకుండా సున్నితమైన కలపతో అందమైన కళా రీతులను జోడించి వీటిని తయారు చేస్తారు. దాంతో వీటిని చూసిన వారు అంతా ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చిన్న పిల్లాలు ఆడుకునేందుకు కాలుష్యం లేని అందమైన వస్తువులుగా ఇవి పేరు గడించాయి. గణతంత్ర వేడుకల పరేడ్ లో ఏటికొప్పాక శకటానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులు అలా కళాకృతులకు ఇపుడు రాష్ట్రపతిభవన్ లో ఏర్పాటు చేసిన స్టాల్ తో మరింతగా పెరుగుతుంది. ఫలితంగా ఏటికొప్పాక కళాకృతుల మార్కెట్ ఇంకా బాగా విస్తరిస్తుంది. అదే విధంగా ఏటికొప్పాక కళాకారులకు ఉపాధి కూడా రెట్టింపు అవుతుంది. ఇలా పవన్ కళ్యాణ్ తన శాఖలకు సంబంధించి తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో అటు సాంస్కృతికపరంగా ఇటు ఆర్ధికంగా అటు ఉపాధి పరంగా ఎన్నో లాభాలు వస్తున్నాయని అంటున్నారు.