Begin typing your search above and press return to search.

పవన్ బాబు బాండింగ్ లో లాజిక్ అదే ?

అలా బాబు కూడా గతంలో రెండు సార్లు వరసగా ఓడారు.

By:  Tupaki Desk   |   19 Dec 2024 8:30 AM GMT
పవన్ బాబు బాండింగ్ లో లాజిక్ అదే ?
X

చంద్రబాబు రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్న నాయకుడు. ఆయన రాజకీయ వ్యూహాలకు దేశంలోనే సరితూగే నేతలు బహు తక్కువగా ఉంటారు. బాబు స్కెచ్ గీసారు అంటే అది పారాల్సిందే. అయితే ఎంతటి నాయకులకు అయినా పరాజయాలు వెక్కిరిస్తూంటాయి. అలా బాబు కూడా గతంలో రెండు సార్లు వరసగా ఓడారు. ఇక 2019లో ఆయన ఘోర పరాజయం పాలు అయ్యారు. జస్ట్ 23 సీట్లు మాత్రమే దక్కాయి.

ఆ పరాభవ భారానికి ఆయన గిర్రున అయిదేళ్ళు తిరగకుండానే వడ్డీతో సహా చెల్లించేశారు. తనకు దక్కిన సీట్ల కంటే కూడా సగానికి ఒకటి తక్కువ చేసి మరీ వైసీపీని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెట్టారు. ఇక వైసీపీ తలెత్తుకోలేని విధంగా ఈ ఓటమి ఉంది.

దానికి కారణం 2019లో చేసిన తప్పులు 2024లో చంద్రబాబు చేయలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అలాగే పవన్ ని అక్కున చేర్చుకున్నారు. అందుకే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. మళ్లీ ఇదే తరహా విజయం దక్కాలీ అంటే ఈ రెండు పార్టీలు తనతోనే ఉండాలన్నది బాబు ఆలోచన. అందుకే ఆయన ఇవే పొత్తులు సుదీర్ఘ కాలం కొనసాగుతాయని ప్రకటిస్తున్నారు.

అంతే కాదు ఆయన పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ పొత్తులు జనం కోసమే అని అంటున్నారు. కానీ వాటి వెనక రాజకీయం చూస్తే కనుక వైసీపీ కోసమే అని అర్థం అవుతుంది అంటున్నారు. వైసీపీని దెబ్బ తీయాలీ అంటే ఇవే పొత్తులతో మళ్ళీ మళ్లీ రావాల్సిందే అన్నది బాబు మార్క్ స్ట్రాటజీ గా చెబుతున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన రీసెంట్ గా విడిపోతే పడిపోతాం కలిసుంటే నిలిచుంటాం అంటూ ఒక ట్వీట్ చేశారు. దానికి ఎన్నో అర్థాలు ఎవరు అనుకున్నా రాజకీయంగా చూస్తే అది పొత్తుల విషయంలో అని కూడా అంటున్నారు. ఈ ట్వీట్ చేసిన పవన్ కి కలసి ఉంటే జరిగే మేలు ఏంటో తెలియనిది కాదు అనే అంటున్నారు.

అందుకే ఆయన చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. బాబు విజనరీ అంటున్నారు. ఆయన రాళ్ళలో మహా నగరాలు నిర్మిచిన మహా నేత అని కీర్తిస్తున్నారు. బాబు మరింత కాలం ఏపీకి సేవ చేయాలని కూడా కోరుకుంటున్నారు. ఈ పొత్తులు చిరకాలం కొనసాగాలని అది ఏపీ అభివృద్ధి కోసమే అని పవన్ కూడా గట్టిగా అంటున్నారు.

దాని పరమార్ధం అందరికీ తెలిసిందే ఏపీలో వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలీ అంటే కచ్చితంగా ఈ పొత్తులు ఉండాలని పవన్ కూడా భావిస్తున్నారు అని అంటున్నారు. ఇక జనసేన ఏపీ పాలిటిక్స్ లో పూర్తిగా ఎమర్జ్ కావాలీ అంటే వైసీపీ అన్నది పొలిటికల్ స్క్రీన్ మీద ఎలిమినేట్ కావాలని అంటున్నారు.

2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు అయినా 40 శాతం ఓటు షేర్ దక్కింది. 175 నియోజకవర్గాల్లో పార్టీ ఉంది. క్యాడర్ ఉంది. అందువల్ల జనసేన మైనస్ టీడీపీ అయితే కచ్చితంగా అది జగన్ కి భారీ పొలిటికల్ అడ్వాంటేజ్ అవుతుంది అన్నది కూడా పవన్ ఆలోచనగా ఉంది అని అంటున్నారు. అది 2019లో రుజువు అయింది కూడా.

అందుకే అటువంటి పొరపాటు చేయకుండా బీజేపీని కూడా కలుపుకుని పటిష్టమైన కూటమిగా 2029లోనూ పోటీ చేయాలన్నది పవన్ ఆలోచనగా ఉంది అని అంటున్నారు. ఇప్పట్లో జనసేన సింగిల్ గా పోటీ చేసినా అధికారంలోకి రాలేదు అని అంటున్నారు. అదే వైసీపీని దెబ్బ తీస్తే ఆ పొలిటికల్ స్లాట్ లోకి జనసేన వెళ్తుందని అపుడు టీడీపీ వర్సెస్ జనసేనగా రాజకీయం మారినా తమకు కలసి వస్తుందని ఆలోచనతోనే ఆయన ఇలా అంటున్నారు అని చెబుతున్నారు. మొత్తానికి రాజకీయంగా సీనియర్ నేత అయిన బాబు నవ తరం ప్రతినిధి అయిన పవన్ కి ఎక్కడ బాండింగ్ కుదిరింది అంటే ఈ విషయంలోనే అని అంటున్నారు.