Begin typing your search above and press return to search.

ఎవరీ అగర్వాల్.. అలీషా? వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

పవన్ కల్యాణ్ నోటి నుంచి వచ్చిన అగర్వాల్.. అలీషాలు ఎవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   1 Dec 2024 6:26 AM GMT
ఎవరీ అగర్వాల్.. అలీషా? వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
X

కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా వేలాది కేజీల బియ్యాన్ని తరలిస్తున్న స్కాంను బట్టబయలు చేసిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీరుపై పెద్ద ఎత్తున ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్న దారుణాన్ని వెలికి తీసిన వేళ.. సీజ్ ద షిప్ అంటూ సంచలన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ నోటి నుంచి.. ‘అషీ ట్రేడింగ్ కంపెనీ? మానసా ఎవరివి? ఎవరీ అలీసా? ఎవరీ అగర్వాల్? అంటూ డీఎస్ వో ఎంవీ ప్రసాద్.. డీఎస్పీ రఘువీర్ విష్ణును నిలదీయటం తెలిసిందే.

పవన్ కల్యాణ్ నోటి నుంచి వచ్చిన అగర్వాల్.. అలీషాలు ఎవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో పేదలకు చెందాల్సిన బియ్యం అక్రమంగా తరలిపోతుంటే.. మీరు కూడా ఎలా ఊరుకుంటారు? అంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబును ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు చేశారు.

అయితే.. గడిచిన ఐదేళ్లుగా కాకినాడ పోర్టులో వైసీపీ నేత ద్వారంపూడి అక్రమాలపై నిలదీసింది తానేనని పేర్కొన్నారు. మరోవైపు ఈ అంశంపై మాట్లాడిన పవన్ కల్యాణ్.. బియ్యం అక్రమ రవాణాలో ద్వారంపూడి సోదరుడి కంపెనీ ఉందని తెలిసిందని.. మొత్తం నెట్ వర్కును ఛేదించాలని చెప్పటం తెలిసిందే. పవన్ ప్రస్తావించిన అగర్వాల్.. అలీషాల విషయానికి వస్తే.. ఈ ఇద్దరు కాకినాడ నగర వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సన్నిహితులన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అగర్వాల్.. అలీషాల్లో ఒకరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సన్నిహితుడైతే.. మరొకరు ఆయన సోదరుడికి అత్యంత సన్నిహితులుగా చెబుతున్నారు. కాకినాడ పోర్టు కేంద్రంగా బియ్యం ఎగుమతుల్లో కీలకమైన వ్యక్తి అగర్వాల్ అలియాస్ వినోద్ అగర్వాల్ గా చెబుతున్నారు. ఇక.. షేక్ అహ్మద్ అలీషా విషయానికి వసతే.. మానసాసంస్థకు యజమానిగా.. కాకినాడ మాజీ ఎమ్మెల్యే సోదరుడికి అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. గడిచిన ఐదేళ్లలో వీరిద్దరి అండతోనే భారీగా బియ్యం అక్రమ రవాణా జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇక.. వీరిద్దరి బ్యాక్ గ్రౌండ కు వెళితే.. నౌకలకు కిరాణా సరుకులు అందించే ఒక ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగిగా పని చేసిన అలీషా, మానసా సంస్థ యజమానిగా చెబుతున్నారు. ఇప్పుడు కోట్లాది రూపాయిలకు పడగలెత్తినట్లుగా చెబుతున్నారు. అగర్వాల్ విషయానికి వస్తే.. దేశ, విదేశాల్లో పరిచయాలు.. నెట్ వర్కు అతనికి కలిసి వచ్చే అంశంగా తెలుస్తోంది. వీరిద్దరూ కాకినాడ పోర్టు ఎగుమతుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా పవన్ కారణంగా ఇంతకాలం కొందరికి మాత్రమే తెలిసిన వీరిద్దరి వ్యవహారం ఇప్పుడు అందరూ మాట్లాడుకునే వరకు వెళ్లినట్లు చెబుతున్నారు.