Begin typing your search above and press return to search.

పవన్ పాలన వెనక ఆయన ఉన్నారా ?

ఆయన పేరు క్రుష్ణ తేజా. ఆయనను పవన్ తెచ్చిపెట్టుకుని తన ఓఎస్డీగా నియమించుకున్నారు.

By:  Tupaki Desk   |   30 Dec 2024 7:50 PM GMT
పవన్ పాలన వెనక ఆయన ఉన్నారా ?
X

జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏడు నెలల పరిపాలన ఎలా ఉంది అంటే బాగానే అని చెప్పాలి. ఎందుకంటే పవన్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అంతకంటే ముందు ఆయనకు రాజకీయంగా అనుభవం తక్కువ. చట్ట సభలలోకి తొలిసారి వచ్చారు. ఆ వెంటనే ఏకంగా డిప్యూటీ సీఎం అయిపోయారు.

ఆయన చేతిలో అయిదారు కీలకమైన శాఖలను ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టారు. అవి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ. అటవీ శాఖ, పర్యవరణ శాఖ వంటివి ఉన్నాయి. పంచాయతీ రాజ్ అంటే ఏపీలో మొత్తం ఉన్న 125 అసెంబ్లీ నియోజకవర్గాలతో పని ఉంటుంది. గతంలో సీనియర్ మంత్రులకు ఈ శాఖను ఇచ్చేవారు. అయితే పవన్ నిభాయించగలరని ఆయనకు కేటాయించారు

అయితే పవన్ పంచాయతీ రాజ్ శాఖలో కీలక మార్పులు తెచ్చారు. ఏకంగా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి గిన్నీస్ రికార్డు నెలకొల్పారు. అంతే కాదు జాతీయ ఉపాధి హామీ పనులకు నిధులను పెద్ద ఎత్తున తేవడమే కాదు పని దినాలను కూడా ఎక్కువ తెచ్చారు.

అలాగే పర్యావరణం విషయంలో ఆయన చాలా చురుకుగా స్పందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలో మౌలిక సదుపాయాలు రోడ్లు, తాగునీరు వంటి వాటి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అటవీ శాఖ మీద సీరియస్ గానే ఫోకస్ పెడుతున్నారు. అలా చూస్తే అనుభవం ఎంతో ఉన్న వారి మాదిరిగానే తన శాఖల పట్ల పవన్ వ్యవహరిస్తున్నారు.

మరి పవన్ కి ఈ శాఖల మీద అంతకంతకు పట్టు దొరకడానికి ఆయన ఏ విధంగా అధ్యయనం చేస్తున్నారు అన్న చర్చ ఉంది. అయితే పవన్ తన మంత్రిత్వ శాఖలలో మెరుగైన పనితీరు కోసం ఒక యువ ఐఏఎస్ అధికారిని ఏరి కోరి తెప్పించుకున్నారు అని అంటున్నారు. ఆయన పేరు క్రుష్ణ తేజా. ఆయనను పవన్ తెచ్చిపెట్టుకుని తన ఓఎస్డీగా నియమించుకున్నారు.

ఈ విషయంలో పవన్ కేంద్రం వద్ద తన పలుకుబడిని ఉపయోగించి మరీ పవన్ ఈ యువ ఐఏఎస్ అధికారిని రప్పించుకున్నారు అని చెబుతున్నారు. ఇక ఆయన సలహా సూచనలు పవన్ మంత్రిత్వ శాఖలలో ఉత్తమమైన పాలన చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అంటున్నారు.

ఈ యువ ఐఏఎస్ సలాహల మేరకు చాలా కాలం వరకూ పవన్ తన శాఖల మీద ఆఫీసులోనే ఉంటూ నిరంతరం సమీక్షలు నిర్వహించేవారు. అలా ఆయన ప్రతీ శాఖ మీద పూర్తిగా అవగాహన ఏర్పరచుకున్నారు. ఇపుడు ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు.

అంటే తాము ఆఫీసులలో ఉండి చేసిన ఆదేశాలు ఎంతమేరకు క్షేత్ర స్థాయిలో అమలు అవుతున్నాయన్నది ఆయన ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు అన్న మాట. ఈవిధంగా చేయడం వల్ల శాఖల మీద సంపూర్ణమైన అవగాహన కుదరడంతో పాటు మరింతగా పాలనను అందించడానికి దోహదపడుతుంది అని అంటున్నారు.

ఇక పవన్ చేపట్టిన శాఖలకు కేంద్ర స్థాయి నుంచి కూడా నిధులు అందుతాయి. దాంతో వాటిని ఏ విధంగా రాబట్టుకోవాలి అన్నది కూడా సదరు యువ ఐఏఎస్ అధికారి సూచనలు ఇస్తున్నారు అని అంటున్నారు. కేంద్రం ఏఏ పధకాలకు ఎంత మేరకు నిధులు ఇస్తుంది వాటిని ఎలా తెచ్చి ఎలా ఖర్చు చేయవచ్చు అన్నది ఆయన దిశానిర్దేశం చేయడంతో పవన్ తనకు ఉన్న పలుకుబడిని కేంద్రం వద్ద ఉపయోగిస్తూ తన శాఖలకు పూర్తి న్యాయం చేస్తున్నారు అని అంటున్నారు.

పంచాయతీ రాజ్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు నిధులు ఇవ్వడం సర్పచులకు నేరుగా నిధులు మంజూరు చేయడం వంటివి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పవన్ కి మంచి పేరుని తీసుకుని వచ్చాయని అంటున్నారు. అంతే కాదు గిరిజన ప్రాంతాలలో రహదారులు వేయడానికి కేంద్రం నుంచి నేరుగా నిధులు మంజూరు అవుతాయి. వాటిని తెలుసుకుని ఆ నిధులను తెచ్చి మరీ ఏజెన్సీలో రోడ్లు వేయడం ద్వారా పవన్ గిరిజనుల మన్ననలు పొందుతున్నారు అని అంటున్నారు. ఆయన ఇటీవల మన్యంలో పర్యటించి పెద్ద ఎత్తున రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు.

ఇదే తీరున మరిన్ని నిధులను తెచ్చి గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల కోసం వెచ్చించాలని పవన్ డెసిషన్ తీసుకున్నారు. పవన్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి పూర్తి సహకారం ఉంది. అలాగే కేంద్ర పెద్దల నుంచి కూడా ప్రోత్సాహం ఉంది. దాంతో ఆయన యువ ఐఏఎస్ అధికారి ఇస్తున్న సూచనలను వెంటనే అమలులోకి పెడుతూ తన శాఖలలో మంచి పట్టుని సాధించడమే కాకుండా సరైన నిర్ణయాలతో మంచి పేరుని తెచ్చుకుంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి పవన్ ఏడు నెలల ఉప ముఖ్యమంత్రిత్వం బాగానే ఉందంటే వెనకాల ఆయన సూచనలు కూడా ఎంతో ఉన్నాయని అంటున్నారు.