ఇదేం ఆగ్రహం పవన్ కల్యాణ్? మీరిప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి!
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీరు ఇప్పుడు కాస్త ఇబ్బందికరంగా మారింది. ఆయన ఆవేశాన్నిఅర్థం చేసుకోవచ్చు.
By: Tupaki Desk | 10 Jan 2025 5:15 AM GMTఅధికారం చేతిలో లేనప్పుడు.. ఏదైనా దారుణం జరిగినప్పుడు.. చర్యలు తీసుకునే వీలు ఉండదు. అలాంటి సమయాల్లో బాధితుల పక్షాన నిలిచి కోట్లాడే క్రమంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం మామూలే. దీన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీరు ఇప్పుడు కాస్త ఇబ్బందికరంగా మారింది. ఆయన ఆవేశాన్నిఅర్థం చేసుకోవచ్చు. అయితే.. ఆయన కూడా అర్థం చేసుకోవల్సిందేమంటే.. తానిప్పుడు విపక్షంలో లేనని.. అధికారపక్షంలో భాగస్వామ్యమై ఉన్నానని. తాను అధికారులపై ప్రదర్శించే ఆగ్రహం..వేసే నిందల్లో తనకు బాధ్యత ఉందని.
ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులే.. అందరి ముందు నిలదీయటం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజానికి వారు చేసింది తప్పే అయితే.. చర్యలు తీసుకుంటే సరిపోతుంది. మాటలతో చెప్పే బదులు చేతల్లో చూపిస్తే మరింత ఎఫెక్ట్ ఉంటుంది కదా? తిరుపతి తొక్కిసలాట నేపథ్యంలో బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన కారులో నుంచి బయటకు వచ్చి.. తనతో మాట్లాడే ప్రయత్నం చేసే మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ.. తన చేతిలో ఉన్న మైకుతో పెద్ద పెద్దగా అరుపులు..వేస్తూ.. అధికారులపై ఆగ్రహావేశాల్ని ప్రదర్శించటంలో ఔచిత్యం ఏమిటి? అన్నది ప్రశ్న.
నిజమే.. తిరుపతి తొక్కిసలాట ఉదంతంలో అధికారులు..పోలీసులు.. టీటీడీ వైఫల్యం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి వేళ.. చర్యల కత్తికి పదను పెట్టి..వరుస పెట్టి ప్రక్షాళన చేయటంతో పాటు.. సరికొత్త విధివిధానాల్ని తీసుకొస్తే సరిపోతుంది కదా? క్రౌడ్ మేనేజ్ మెంట్ లేదని.. ఏదైనా విపత్తు విరుచుకుపడినప్పుడు.. సహాయక చర్యలకు తగిన ఏర్పాట్లు లేవన్న విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు.. వాటికి పరిష్కారంగా చేపట్టాల్సిన చర్యల ఏమిటన్నది చెబుతూ.. ఒక భరోసాలాంటిది ఇవ్వాల్సిన అవసరం ఉంది.
అందుకు భిన్నంగా ప్రతిపక్ష నేత తరహాలో అధికారుల మీద విరుచుకుపడటం.. అది కూడా అందరి ముందు ఆవేశంతో ఊగిపోవటం లాంటి చర్యలు ‘షో’ చేసినట్లుగా ఉంటుందే తప్పించి.. ఇంకేమీ కనిపించదు. ఇలాంటి చేష్టలు ఆయన మీద ఉన్న గౌరవాన్ని తగ్గించటమే కాదు.. ఆయన కమిట్ మెంట్ మీద కొత్త అనుమానాలు కలిగేలా చేస్తాయి. మొన్నటికి మొన్న కాకినాడ పోర్టులో అక్రమంగా తరలుతున్న బియ్యాన్ని పట్టుకునే క్రమంలో ఆకస్మిక తనిఖీ చేసేందుకు వస్తుంటే పోలీసు ఉన్నతాధికారి సెలవు మీద వెళ్లినట్లుగా చెప్పిన పవన్.. ఆ తర్వాత ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నది చెప్పాలి కదా? ఆవేశంతో అరవటం కంటే కూడా.. వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అవసరమైన నిర్ణయాలు అత్యవసరం. అలాంటి వాటి మీద డిప్యూటీ సీఎం పవన్ ఫోకస్ పెడితే మంచిది.