డీఎంకే పార్టీకి షాకిచ్చిన పవన్.. అండగా అన్నాడీఎంకే!
తమిళనాడు రాజకీయాల్లో గత నెల 15వ తారీకు నుంచి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కూడా పెను చర్చగా మారిన విషయం తెలిసిందే
By: Tupaki Desk | 6 Oct 2024 5:45 AM GMTతమిళనాడు రాజకీయాల్లో గత నెల 15వ తారీకు నుంచి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కూడా పెను చర్చగా మారిన విషయం తెలిసిందే. ఎందుకంటే.. తిరుమలకు నెయ్యిని సరఫరా చేసింది... దుండిగల్ కు చెందిన ఏఆర్ ఫుడ్ ఇండస్ట్రీస్ సంస్థే కావడం.. దీనికి పెద్దగా అనుభవం, సరఫరా చేసే సామర్థ్యం లేక పోవడంతో ఈ సంస్థ చుట్టూ అనేక వివాదాలు, విమర్శలు చోటు చేసుకున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం కేసు కూడా నమోదు చేసింది.
ఇక, ఈ విషయంలో సనాతన ధర్మ పరిరక్షణ అంటూ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను కూడా చేపట్టారు. ఈ దీక్షను 11 రోజుల తర్వాత తిరుపతిలో ఆయన విరమించారు. అయితే.. ఈ సంద ర్భంగా ఆయన వారాహి సభలో మాట్లాడుతూ.. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే యువ నాయకుడు, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధిపై విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మాన్ని గత ఏడాది డెంగీతో పోల్చిన ఉదయనిధిపై నిప్పులు చెరిగారు.
ఇది పరోక్షంగా చేసిన వ్యాఖ్య కాదు.. పవన్ నేరుగా తమిళంలోనే ఉదయనిధిపై విరుచుకుపడ్డారు. దీంతో అక్కడి ఓ న్యాయవాది.. పవన్‌పై కేసు కూడా పెట్టారు. ఇక, రాజకీయంగా దీనిపై ఉదయనిధి స్పందించేం దుకు కొంత సమయం కావాలంటూ.. పేర్కొనడం గమనార్హం. అంటే.. మొత్తంగా అదును చూసుకుని ఉదయనిధి విరుచుకు పడడం ఖాయమనే సంకేతాలు వచ్చాయి. ఇలాంటి కీలక సమయంలో పవన్ కల్యాణ్.. అక్కడి ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే(జయలలిత పార్టీ)ని ప్రసంశిస్తూ.. సుదీర్ఘ వ్యాఖ్యలు చేశారు.
అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, సీనియర్ నటుడు, దివంగత ఎంజీఆర్‌ను పవన్ ఆకాశానికి ఎత్తేశారు. "చిన్నప్పుడు చెన్నైలో ఉన్న సమయంలోనే 'పురచ్చి తలైవర్' ఎంజీఆర్ గారి పట్ల ప్రేమ, అభిమానం నాలో అంతర్భాగంగా ఉన్నాయి. ఆ ప్రేమాభిమానాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి. రాబోయే అన్నాడీఎంకే 53వ ఆవిర్భావ దినోత్సవం (అక్టోబర్ 17న) సందర్భంగా 'పురచ్చి తలైవర్' ఆరాధకులు, అభిమానులందరికీ నా శుభాకాంక్షలు`` అని పవన్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం తమిళనాడులో అన్నాడీఎంకేకు కూడా.. పవన్ వంటిబలమైన వాయిస్ అవసరం ఏర్పడింది. పవన్ కు కూడా.. డీఎంకేను ఎదుర్కొనాలంటే.. (రేపు ఏదైనా ఎదురు దాడి చేసినా.. పవన్ ఆస్తులపై దాడులు జరిగినా) అన్నాడీఎంకే వంటి పార్టీల అవసరం పవన్‌కు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఎంజీఆర్‌ను ప్రశంసిస్తూ.. చేసిన ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లోనే కాదు.. తమిళ రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది. దీంతో డీఎంకే పవన్‌ను కనుక టార్గెట్ చేస్తే.. అది పవన్ దాకా కూడా రాకుండా.. అన్నాడీఎంకేనే సమాధానం చెప్పే పరిస్థితి ఏర్పడింది.