ప్రకాష్ రాజ్ కి పవన్ జంకారా ?
దాని మీద విదేశాలలో షూటింగులో ఉన్న ప్రకాష్ రాజ్ అయితే వెంటనే వీడియో బైట్ రిలీజ్ చేశారు.
By: Tupaki Desk | 28 Sep 2024 3:42 AM GMTటీడీపీ కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా తిరుగులేని అధికారంతో ఉన్న పవన్ కళ్యాణ్ మొదటి మూడు నెలలూ సైలెంట్ గానే ఉన్నారు. ఆయన సహనం మీద కూడా ప్రశంసలు కురిసాయి. కానీ లడ్డూ ఇష్యూలో మాత్రం ఆయనలోని ఆవేశం బయటకు వచ్చింది.
అయితే విపక్షంలో ఉన్నపుడు అదే ఆవేశం చెల్లుతుంది. అది బలాన్ని ఇస్తుంది కానీ అధికారంలో ఉన్నపుడు మైనస్ అవుతుంది. దాంతో పాటు పవన్ చేసిన కొన్ని హాట్ కామెంట్స్ కూడా ఆయనను ఇరకాటంలో పెట్టాయి. ప్రకాష్ రాజ్ మీద ఆయన విమర్శలు చేయడం ఆయనకు ఏమి పని అంటూ ప్రశ్నించడం జరిగింది.
దాని మీద విదేశాలలో షూటింగులో ఉన్న ప్రకాష్ రాజ్ అయితే వెంటనే వీడియో బైట్ రిలీజ్ చేశారు. తాను ఇపుడు ఏమీ మాట్లాడను అని పవన్ కి అన్ని ప్రశ్నలకు ఈ నెల 30న తాను జవాబు చెబుతాను అని అన్నారు. అంటే ఆ బాకీ అలాగే ఉంది అన్న మాట. ఈ లోగా ప్రతీ రోజూ ఎక్స్ వేదికగా ట్వీట్లు చేస్తూ పవన్ మీద కామెంట్స్ కి పని చెబుతున్నారు ప్రకాష్ రాజ్.
ఆయన జస్ట్ ఆస్కింగ్ అంటూనే ఎన్నికల ముందు ఒక అవతారం అధికారం చేపట్టాక మరో అవతారం అని చేసిన కామెంట్స్ కానీ అదే విధంగా అసలు మీకు ఏమి కావాలి భావోద్వేగాలను రెచ్చగొట్టడమేనా అంటూ ఆయన చేసిన మరో ట్వీట్ ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. మొత్తం మీద పవన్ ని ఆయన గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ విషయం మీద స్పందించారు. ఆయన తనకు మంచి మిత్రుడు అంటూ పవన్ చెప్పుకొచ్చారు. పైగా ఆయనేమీ శత్రువు కారని కూడా అన్నారు. తమ ఇద్దరి మధ్యలో అభిప్రాయ విభేదాలు ఉండొచ్చేమో కానీ తాను ఆయనను గౌరవిస్తాను అని కూడా అన్నారు.
భక్తుల మనోభావాలు దెబ్బ తినడంతో దోషులకు శిక్ష పడాలన్న ఉద్దేశ్యంతోనే తాను ట్వీట్ పెట్టాను అని అన్నారు. అయితే దాని మీద ప్రకాష్ రాజ్ కామెంట్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే ఆయన ట్వీట్ ని తాను అయితే తప్పుగా అర్ధం చేసుకోలేదు అని పవన్ చెప్పుకొచ్చారు.
మొత్తం మీద చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ విషయంలో జంకారా ఎందుకు వివాదాలు అని వెనక్కి తగ్గారా అన్న చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే ప్రకాష్ రాజ్ ఈ నెల 30న హైదరాబాద్ వచ్చి ఏమి మాట్లాడుతారో అన్న చర్చ ఉండనే ఉంది. దాని కంటే ముందే ఆయన తనకు మిత్రుడు అంటూ పవన్ చెప్పడం ద్వారా ప్రకాష్ రాజ్ జోరుని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా అనేది చర్చకు వచ్చింది.
ఇంతకీ పవన్ మొదటి ట్వీట్ లో చెప్పినది ఏంటి అంటే అధికారం మీ చేతిలో ఉంది కదా బాధ్యుల మీద చర్యలు తీసుకోకుండా ఈ సనాతన ధర్మం అంటూ ఏవేవో ప్రకటనలు ఎందుకు అంటూ నిలదీశారు. దాని మీద పవన్ ఏకంగా మీడియా సమావేశంలో ఆవేశపడ్డారు. మొత్తానికి చూస్తే ప్రకాష్ రాజ్ ఐడియాలజీ విషయంలో ఎక్కడా తగ్గరు. పైగా లాజిక్కులతో కొడతారు. ఆయన విషయంలో పవన్ చేసిన తాజా కామెంట్స్ చూస్తే కనుక ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఆలోచించాల్సిందే.