పవన్ పక్కనే వర్మ...అయినా సైన్యానికి పట్టదే !
ఆయన సైన్యం లేని రాజు. పేరు వర్మ. ఆయనకంటూ సొంత సైన్యం ఉందనుకోండి. అది వేరే లెక్క.
By: Tupaki Desk | 11 Sep 2024 8:30 AM GMTఆయన సైన్యం లేని రాజు. పేరు వర్మ. ఆయనకంటూ సొంత సైన్యం ఉందనుకోండి. అది వేరే లెక్క. కానీ కూటమి కట్టాక జనసేన పిఠాపురంలో అధికారం చేపట్టాక ఆ నియోజకవర్గానికి కింగ్ లాంటి వర్మ కాస్తా డీలా పడిపోయారు పాత నీరుని కొత్త నీరొచ్చి కదల్చినట్లుగా వర్మ రాజకీయానికి పోటీ రాజకీయం పిఠాపురంలో తయారైంది.'
జనసేన చేతిలో పిఠాపురం ఉండడంతో జనసైనికులు తమ హవా చాటుతున్నారు. వారిదే అన్నింటా అగ్రతాంబూలం కావాలని కోరుకుంటున్నారు. పిఠాపురం వర్మ అయితే రెండు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గాన్ని నమ్ముకుని పాలిటిక్స్ చేస్తున్నారు. అయితే ఇపుడు మాత్రం ఆయనను పక్కన పెట్టేస్తున్నారు.
దీంతో వర్మ అండ్ కో తీవ్ర మనస్తాపానికి లోను అవుతున్నారు. మరో వైపు చూస్తే వర్మ తనదైన శైలిలో పిఠాపురంలో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ ఎటూ ఉప ముఖ్యమంత్రి కాబట్టి తాను మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన తనకు ఉన్న పలుకుబడితో స్థానికంగా పనులు చేయిస్తూ జనంలో ఉండేలా చూసుకుంటున్నారు.
సరిగ్గా ఇక్కడే జనసైన్యంతో ఆయనకు లడాయి వచ్చి పడుతోంది. తమ ప్రమేయం లేకుండా వర్మ దూసుకుని పోవడాన్ని వారు తప్పు పడుతున్నారు. అంతే కాదు పిఠాపురం జనసేన సొంతం అన్నట్లుగా జనసేన నాయకులు పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలలో సైతం ఒక మాజీ ఎమ్మెల్యే గా మిత్ర పక్ష నేతగా వర్మకు కబురు అయినా పంపడంలేదు
ఈ పరిణామాల నేపథ్యంలో వర్మ వర్సెస్ జనసేనగా అక్కడ పొలిటికల్ సీన్ మారింది. అయితే పవన్ తో మాత్రం వర్మకు అంతా బాగానే ఉంది అని అంటున్నారు. వరద బాధితులను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చినపుడు ఆయన పక్కనే వర్మ ఉన్నారు. పవన్ తో ఆయన నడిచారు. వరద నీటిలో అడుగులు వేశారు.
పవన్ తో కలసి బోటులో ప్రయాణించి వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన కూడా పరిశీలించారు. పవన్ సైతం వర్మను పక్కనే ఉంచుకున్నారు. మిత్రుడిగా ఆయనకు ఇవ్వాల్సిన మర్యాద అన్నీ ఇస్తున్నారు. దాంతో పవన్ దగ్గర వర్మ ప్లేస్ పదిలంగానే ఉంది అని అంతా అంటున్నారు.
మధ్యలో జనసేన నేతలతోనే ఇబ్బందులు తప్ప వర్మ అంటే పవన్ తగిన గౌరవం ఇస్తున్నారు అని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యేగా వర్మకు స్థానిక పరిస్థితులు అన్నీ తెలుసు కాబట్టి ఆయనతోనే పవన్ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి సమస్యలను ఆకలింపు చేసుకున్నారు అని అంటున్నారు.
పవన్ పక్కన వర్మ తిరగడంతో జనసేన టీడీపీల మధ్య వర్గ పోరు అనుకున్నంతగా ఏమీ లేదని వర్మకు చంద్రబాబు పవన్ ల వద్ద పలుకుబడి ఉన్నంతవరకూ ఆయనే పిఠాపురం కింగ్ అని ఆయన వర్గం అంటున్నారు. స్థానికంగా ఎవరైనా హడావుడి చేసినా మాజీ ఎమ్మెల్యేగా సీనియర్ నేతగా వర్మ తనదైన వ్యూహాలతో నెగ్గుకుని రాగలరు అని కూడా అంటున్నారు. మొత్తానికి పిఠాపురంలో జనసేన వర్సెస్ వర్మ కధకు వరదల సాక్షిగా కామా అయినా పడిందా అంటే చూడాలని అంటున్నారు.