‘ముందు ఫ్యాన్స్ ని ఇక్కడ నుంచి పంపించేయండి’... పవన్ హుకుం!
సినిమా ఫంక్షన్స్ లో పవన్ కల్యాణ్ మాట్లాడటానికి మైక్ అందుకున్నప్పుడు ఫ్యాన్స్ చేసే హడావిడి గురించి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Jan 2025 4:40 AM GMTఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లినా, ఏ పరిస్థితుల్లో వెళ్లినా, ఏ కారణం చేత వెళ్లినా.. అక్కడ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ గుమిగూడతారనే సంగతి తెలిసిందే. సినిమా ఫంక్షన్స్ లో అయినా.. రాజకీయ కార్యక్రమాల్లో అయినా అది అత్యంత సహజం అన్నట్లుగా మారింది. అయితే.. ఇటీవల అదే పవన్ కు పెద్ద సమస్యగా మారింది.. ఆగ్రహం తెప్పిస్తోంది.
అవును... సినిమా ఫంక్షన్స్ లో పవన్ కల్యాణ్ మాట్లాడటానికి మైక్ అందుకున్నప్పుడు ఫ్యాన్స్ చేసే హడావిడి గురించి తెలిసిందే. ఆ సమయంలో పవన్ కల్యాణ్ కాస్త సమయం వారు అరవడానికి వదిలేసినట్లుగా ఉండాల్సిన పరిస్థితి నెలకొనేది! దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యేవి. అయితే.. అవి సినిమా ఫంక్షన్స్ కాబట్టి చెల్లిపోయేది.. పవన్ నవ్వి ఊరుకునేవారు.
అయితే.. పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి. ఆయన పలు సందర్భాల్లో, పలు కారణాలతో రకరకాల చోట్ల ప్రయాణిస్తుంటారు. ఆ సమయంలో కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ వ్యవహారశైలి పవన్ కు చికాకు తెప్పిస్తుందని అంటున్నారు. ఈ సమయంలో ఆయన తన అభిమానుల క్రమశిక్షణపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.
ఈ క్రమంలో... తాజాగా తిరుపతిలోనూ అదే జరిగింది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట పెను విషాధం కలిగించిన సంగతి తెలిసిందే. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా.. సుమారు 30 మంది గాయపడినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో బాధితులను పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ సిమ్స్ కు వచ్చారు.
ఈ సమయంలో అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడారు.. పవన్ ను చూట్టుముట్టారు. ఈ సమయంలో కొంతమంది సెల్ఫీల కోసం ఎగబడగా.. మరికొంతమంది విడియోలు తీసే ప్రయత్నం చేశారు. ఇంకొంతమంది... సీఎం సీఎం అంటూ నినాదాలు చేయగా, ఇంకొందరూ ఓజీ ఓజీ అని నినదించడం గమనార్హం.
ఇలా సమయం సందర్భంగా లేకుండా తన అభిమానులు ప్రవర్తించిన తీరుపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. అభిమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా.. "మనుషులు చనిపోయారు.. ఇది నినాదాలూ చేసే సమయమా.. మీకు బాధలేదా.. కొంతైనా బాధ్యత లేకపోతే ఎలా అని వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం శృతిమించి ప్రవర్తిస్తున్నట్లు కనిపించడంతోనో ఏమో కానీ... అభిమానులందరినీ ఇక్కడ నుంచి పంపించేయాలని పవన్ పోలీసులను ఆదేశించారు.