పవన్ ఆవేదన - ఆక్రోశం.. రెండు కారణాలు.. !
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కాకినాడ పోర్టులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారీ ఎత్తున ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 30 Nov 2024 10:30 AM GMTఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కాకినాడ పోర్టులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారీ ఎత్తున ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేశారు. ``ఉప ముఖ్యమంత్రినైన నన్నే`` అంటూ ఆయన పోర్టు అధికారులపై విరుచుకుపడ్డారు. తాను పరిశీలనకు వస్తానంటే కూడా వద్దన్నారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. అసలు ఈ ఆవేదన, ఆక్రోశానికి అధికారుల అడ్డగింతేకారణమా? అంటే.. కాదని అంటున్నారు పరిశీలకు లు. దీని వెనుక మరో రెండు కీలక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
నిజానికి పోర్టులు రాష్ట్రాల పరిధిలో ఉండవు. పోర్టు బయట వరకు మాత్రమే రాష్ట్రాలకు అధికారం ఉంటుంది. లోపల వ్యవహారాలు అన్నీ కూడా.. కేంద్రం నియమించిన అధికారుల చేతిలో ఉంటుంది. ఈవి షయం పవన్‌కు తెలియంది కాదు. కాబట్టి.. ఎవరినైనా వద్దనే హక్కు, అధికారం రెండూ కూడా పోర్టు అధికారులకే ఉంటుంది. భారత నౌకా రంగం చేతిలోనే పోర్టుల వ్యవహారం ఉంటుంది. కాబట్టి పవన్ చేసిన వ్యాఖ్యలు.. వారికి అంటుకోవు.
సాక్షాత్తూ ముఖ్యమంత్రి వెళ్లినా.. పైనుంచి ఆదేశాలు ఉంటేనే లోపలకు అనుమతిస్తారు. లేక పోతే గేట్లు మూసేస్తారు. దీనికి తమిళనాడే ఉదాహరణ. ఇక, పవన్ ఆవేదన విషయాన్ని తీసుకుంటే.. స్థానికంగా ఉన్న కొందరు కూటమి నేతలు.. చేస్తున్న అక్రమాలపైనే ఆయన ఆగ్రహం ఉంది. వైసీపీకి ఓ స్థానిక నాయకుడికి వీరు సహకరిస్తున్నారన్నది ప్రధానంగా పవన్ ఆవేదన. సదరు వైసీపీనాయకుడిని అడ్డంగా బుక్ చేసి జైలుకు పంపించాలన్నది ఆయన లక్ష్యం. అయితే.. ఇది అంత సాధ్యం అయితే కావడం లేదు.
సదరు నేతకు కూటమి నాయకులే అండగా ఉన్నారు. ఈ విషయాన్ని బయటకు చెప్పలేక.. కడుపులో దాచుకోలేక ఇలా ఇప్పుడు బయటపడ్డారు. ఇక, రెండో కారణం..స్థానిక జిల్లా పోలీసులు సరైన విధంగా ఆయనను గౌరవించకపోవడం. దీనికి కూడా.. రాజకీయ కారణాలు ఉన్నాయన్నది పవన్ అంతర్గత చర్చల్లో చెబుతున్న మాట. తాజాగా ఎస్పీ తన పర్యటనలో లేరని, సెలవుపై వెళ్లిపోయారని పవనే చెప్పారు. ఇది అసాధారణమని ఆయన భావిస్తున్నారు. కానీ..స్థానికంగా ఉన్న కూటమి పెద్దలే ఈ వ్యవహారంలో ఉన్నారన్నది ఆయనకు కూడా తెలుసు. కానీ నేరుగా వారిని ఏమీ అనలేక.. ఇలా ఆక్రోశం వెళ్లగక్కడం గమనార్హం.